సామాన్యులపై ధరల పిడుగు.. 4 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం.. దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అత్యధికం!

Wait 5 sec.

Retail Inflation: పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు భారీగా పెరిగాయి. దీంతో ఏప్రిల్, 2026 నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 3.48 శాతానికి ఎగబాకింది. 4 నెలల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.74 శాతం, ఫిబ్రవరి నెలలో 3.21 శాతం, మార్చి నెలలో 3.40 శాతంగా ఉండగా ఇప్పుడు అంతకు మించి నమోదవడం సామాన్యుల నడ్డి విరుస్తోందని చెప్పవచ్చు. 2024 బేస్ ఏడాది ప్రకారం వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మంగళవారం విడుదల చేసింది. ఆహార ద్రవ్యోల్బణం గత మార్చి నెలలో 3.87 శాతంగా నమోదు కాగా అది ఏప్రిల్ నాటికి 4.20 శాతానికి చేరినట్లు ఎన్‌ఎస్‌ఓ తెలిపింది. ఏప్రిల్ నెలలో బంగారం ఆభరణాల ధరలు 144.34 శాతం మేర పెరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో కొబ్బరి ధర 44.55 శాతం పెరిగింది. బంగారం, వజ్రాలు, ప్లాటినం ఆభరణాలు 40.72 శాతం, టమాటా 35.28 శాతం, కాలీఫ్లవర్ 25.58 శాతంగా ఉన్నాయి. బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, మోటార్ కార్లు, జీపులు, బఠానీలు, ఏసీల ధరలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలోనే అత్యధికంగ్రామీణ ప్రాంతాల్లో ఇన్‌ఫ్లేషన్ 3.74 శాతంగా ఉండగా పట్టణ ప్రాంతాల్లో 3.16 శాతంగా ఉంది. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే రిటైల్ ద్రవ్యోల్బణం మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా నమోదైంది. ఏప్రిల్ నెలలో తెలంగాణలో అత్యధికంగా 5.81 శాతం నమోదైనట్లు ఎన్ఎస్‌ఓ తెలిపింది. ఇక అత్యల్పంగా అంటే మిజోరాంలో 0.69 శాతం మాత్రమే ఉంది.మొదటి త్రైమాసికంలో 4 శాతంగా నమోదు అయ్యే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత నెలలోనే అంచనా వేసింది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలు, ఎల్‌నినో పరిస్థితుల వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరిగే ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. అలాగే ద్రవ్యోల్బణ గణాంకాల కోసం దేశవ్యాప్తంగా 1407 పట్టణ మార్కెట్లు, 1465 గ్రామాల నుంచి ఎప్పటికప్పుడు ధరలను ఎన్ఎస్ఓ సేకరిస్తుంది. మరోవైపు.. పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం నుంచి తట్టుకుని నిలబడేందుకు కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే బంగారం దిగుమతి సంకాలను భారీగా పెంచింది. పొదుపు మంత్రం పాటించాలని ప్రజలకు సూచించింది.