ట్రాఫిక్ ఎస్సై హరిప్రసాద్‌ సర్వీస్ నుంచి తొలగింపు.. గతంలో మంత్రి లోకేష్ దృష్టికి, ఇప్పుడు ఉద్యోగమే పోయింది

Wait 5 sec.

ఏపీలో కొందరు పోలీసులు తీరు వివాదాస్పదం అవుతోంది.. ఇటీవల కాలంలో కొందరు పోలీసులు వివాదాల్లోకి చిక్కుకుని కష్టాలు కొని తెచ్చుకున్నారు. తాజాగా కర్నూలులో ఓ ఎస్సై ఏకంగా ఉద్యోగం పోగొట్టుకున్నారు. కర్నూలు ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్‌ ఎస్సై హరిప్రసాద్‌ను సర్వీస్ నుంచి తొలగించారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్తవులు జారీ చేశారు. కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్‌ 2012 బ్యాచ్‌ ఎస్సై.. ఆయన నంద్యాల జిల్లాలో ఎక్కువ రోజులు విధుల్లో ఉన్నారు. హరిప్రసాద్‌ను వరుసగా వివాదాలు చుట్టుముట్టాయి.హరిప్రసాద్ గతంలో ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నప్పుడు ఓ ట్రాక్టర్ డ్రైవర్ సంచలన ఆరోపణలు చేశారు. తనను ఎస్సై వేధిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేసి ఆ వీడియోను మంత్రి లోకేష్‌కు పంపారు. ఈ అంశం వివాదాస్పదం కావడంతో వెంటనే స్పందించి డీజీపీ ఎస్సై హరిప్రసాద్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలానికి ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయగా.. చిత్తూరు జిల్లాలో ఎస్సైగా పనిచేశారు. ఆ తర్వాత ఇటీవల కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌‌కు ఎస్సైగా వచ్చారు. కర్నూలులో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎస్సై హరిప్రసాద్‌కు ఓ యువతి పరిచయం కాగా.. ఆమెకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరిద్దరు మూడేళ్ల పాటూ సన్నిహితంగా ఉన్నారు.. ఆ తర్వాత ఆ యువతి ఎస్సై గురించి తెలిసి దూరం పెట్టింది. ఆ యువతికి వివాహం నిశ్చయం కాగా.. ఈ విషయం తెలిసి ఎస్సై ఆమెను వేధించడంతో పాటుగా బెదిరింపులకు దిగాడు. పాపం ఆ యువతి ఎస్సైతో దిగిన వ్యక్తిగత ఫోటోలను.. ఆమె పెళ్లి చేసుకోబోయే యువకుడికి పంపడంతో పెళ్లి ఆగిపోయింది. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి ఎస్సై తప్పు ఉందని తేలడంతో ఏకంగా సర్వీసుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య విషయంలో ఎస్సై హరిప్రసాద్ గురించి మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది.. సస్పెండ్ కూడా అయ్యారు. అయినా సరే ఎస్సై తన ప్రవర్తన మర్చికోలేదు.. ఇప్పుడు ఏకంగా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు.