తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో గెలిచిన టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనను బలపరీక్షలో పాల్గొనకుండా నిరోధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై బుధవారం స్టే విధించింది. ఈ సందర్భంగా మద్రాసు హైకోర్టు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఇది అత్యంత దారుణమైన చర్య అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ టీవీకే ఎమ్మెల్యే ఆర్. శ్రీనివాస సేతుపతి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌‌పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు అత్యవసర విచారణకు జాబితా చేయాలని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సోమవారం కోరారు. దీంతో ఈ కేసును బుధవారం నాటి విచారణ జాబితాలో చేర్చడానికి ధర్మాసనం అంగీకరించింది.ఈ సందర్భంగా జస్టిస్‌లు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ధర్మాసనం.. ‘‘ఇది అత్యంత దారుణం’’ అని మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. అంతేకాదు, ఈ అంశంపై హైకోర్టు పెండింగ్‌లో ఉన్న విచారణను కూడా ధర్మాసనం నిలిపివేసింది. ఎన్నికల ఫలితాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టులో ఎలా కొనసాగించగలరని డీఎంకే నేత కేఆర్ పెరియకరుప్పన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘‘ఎన్నికల పిటిషన్ అని చెబుతూనే, హైకోర్టు ఈ రిట్ పిటిషన్‌ను ఎలా స్వీకరిస్తోంది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ‘‘మేము ఇరుపక్షాల సీనియర్ న్యాయవాదుల వాదనలు విన్నాం... ప్రతివాది తరఫు లాయర్‌కు సమాధానం ఇవ్వడానికి రెండు వారాల గడువు ఇచ్చాం... ఈలోగా, సవాల్ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తున్నాం... తదుపరి విచారణను కూడా హైకోర్టు నిలిపివేయాలి’’ అని ధర్మాసనం ఆదేశించింది.శివగంగై జిల్లా తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున పోటీచేసిన శ్రీనివాస సేతుపతి.. డీఎంకే మంత్రి కేఆర్ పెరియకరుప్పన్‌పై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పొరపాటున మరో నియోజకవర్గానికి పంపిన పోస్టల్ బ్యాలెట్‌ తిరస్కరణ, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పెరియకరుప్పన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సేతుపతి బలపరీక్ష లేదా ఇతర ప్రక్రియలో పాల్గొనకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇదిలా ఉండగా, జోసెఫ్ విజయ్ సారథ్యంలోని టీవీకే బుధవారం తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో విజయం సాధించింది. డీఎంకే ఎమ్మెల్యేలు గైర్హాజరు కాగా.. అన్నాడీఎంకేలో చీలిక కారణంగా ఆ పార్టీకిి చెందిన 24 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు అనుకూలంగా ఓటువేశారు.