ఇంగ్లండ్ మహిళా దిగ్గజ వికెట్ కీపర్ అరుదైన అవకాశంతో క్రికెట్‌లో ఓ చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్ తరఫున ఎన్నో ఏళ్లపాటు వికెట్ కీపర్‌గా పనిచేసిన సారా ఇప్పుడు ఇంగ్లండ్ పురుషుల టెస్టు జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా నియమితులైంది. ఒక పురుష జట్టుకు సపోర్టింగ్ కోచ్‌గా నియమితులైన తొలి మహిళగా ఆమె నిలిచింది. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ నుంచి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనుంది. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ రోబ్ కీ అధికారికంగా ప్రకటించాడు. 37 సంవత్సరాల సారా టేలర్ మహిళా క్రికెటర్లలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకరు. టెస్టు, వన్డే, టీ20 ఇలా అన్ని ఫార్మాట్లలో కలిపి సారా 226 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో కలిసి ఆండ్రూ ఫ్లింటాఫ్ కింద కూడా ఆమె పనిచేసింది. ఇంగ్లండ్ ఏ జట్టుగా పేరొందిన ఇంగ్లండ్ లయన్స్ కోచింగ్‌లో ఆమె చూపిన ప్రతిభతో సీనియర్ జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో చోటు దక్కించుకుంది. సారా టేలర్ ఇప్పటికే సస్సెక్స్ పురుషుల జట్టుతో పాటు మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టుతో కూడా కలిసి పనిచేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కన్సన్ ఐపీఎల్‌లోని ముంబై ఇండియన్స్ జట్టుతో ఉండటంతో.. ఇంగ్లండ్ - న్యూజిలాండ్ సిరీస్‌ కోసం సారా టేలర్‌కు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈసీబీ డైరెక్టర్ రోబ్ కీ మాట్లాడుతూ ఆండ్రూ ఫ్లింటాఫ్, ఎడ్ బార్నీ ఇద్దరూ ఆమె గురించి గొప్పగా చెప్పారని, సపోర్టింగ్ స్టాఫ్‌లో ఆమె చాలా బెస్ట్ అంటూ ప్రశంసించాడు. క్రికెట్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటూ ఆమె తీరు అందర్నీ ఆకట్టుకుందని అందుకే ఇంగ్లండ్ ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం ఇచ్చామని వెల్లడించాడు. అదేవిధంగా ఇంగ్లండ్ ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హాప్కిన్సన్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌తో బిజీగా ఉండటంతో, కివీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు దూరంగా ఉంటాడని కూడా రోబ్ కీ అధికారికంగా ప్రకటించాడు.