‘పెద్ది’ పెద్ద హిట్టవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా?: నిర్మాత నాగవంశీ

Wait 5 sec.

సింగిల్‌ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజీ విధానం తీసుకురావాలంటూ ఇటీవల తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ కీలక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎస్వీసీ శిరీష్ రెడ్డి, ఏషియన్ సునీల్ నారంగ్ తో సహా పలువురు ఎగ్జిబిటర్లు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. పర్సంటేజీ ఇవ్వడానికి ఒప్పుకున్న నిర్మాతల సినిమాలనే ప్రదర్శిస్తామని, ఇకపై ప్రభుత్వం జీవో జారీ చేసినా టికెట్ రేట్లు పెంచమని ప్రకటించారు. సింగిల్ స్క్రీన్లు మనుగడ సాగించాలంటే కచ్చితంగా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేశారు. 'పెద్ది' సినిమా రిలీజుకు ముందు ఎగ్జిబిటర్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి కౌంటర్ గా యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్‌ యలమంచిలి, సితార సూర్యదేవర నాగవంశీ, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, వృద్ధి సినిమాస్ సతీష్ కిలారు తదితరులు బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏషియన్ సునీల్ కు నాగవంశీ కౌంటర్ ఇచ్చారు. ''ఒక పెద్ద ప్రొడ్యూసర్, 300 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్న ఓ ఎగ్జిబిటర్.. సింగిల్ స్క్రీన్స్ బాధలు చెబుతుంటే వినడానికి నవ్వొచ్చినా ఏమీ చేయలేకపోతున్నాం. సీ సెంటర్ నుంచి బీ, ఏ సెంటర్ వరకు ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ మల్టీప్లెక్స్‌లు కట్టేసి, సింగిల్ స్క్రీన్స్‌కు రావాల్సిన రెవెన్యూ రాకుండా చేస్తున్న ఆ ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్స్ కష్టాలు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది. దయచేసి కామెడీలు చేయడానికి ప్రెస్‌మీట్లు పెట్టకండి'' అని నాగ వంశీ సెటైర్లు వేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని, ఎగ్జిబిటర్లు అడుగుతున్న పర్సంటేజ్‌ని తాము ఇవ్వలేమని నాగవంశీ అన్నారు. ''పర్సంటేజీ సిస్టమ్‌ ప్రకటించిన 23 థియేటర్లు లీజులోనే ఉన్నాయి. నష్టాలు వస్తున్నాయి కాబట్టి పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు. నష్టాలు వస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు?. థియేటర్లు వదిలేయండి. ఓనర్స్ తో మాట్లాడుకొని మేము సినిమాలను రిలీజ్ చేసుకుంటాం. లాస్ వస్తున్నా థియేటర్లు పట్టుకుని వేలాడటం ఎందుకు? వదిలేయొచ్చు కదా. అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏముంది?'' అని నాగవంశీ ప్రశ్నించారు. కేవలం నాలుగైదు సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు అడుగుతున్నామని, మిగతా సినిమాకు టికెట్ రేట్లు హైక్ లేకుండా చూస్తామనని చెప్పారు. ''ఇక్కడ కూర్చున్న అందరివీ రిలీజ్ కి దగ్గరగా 25 సినిమాలున్నాయి. ఆల్రెడీ 75 శాతం ప్రొడక్షన్ కాస్ట్ ఖర్చు చేశాం. హీరోల, డైరెక్టర్ల రెమ్యూనరేషన్ అన్నీ ఫిక్స్ అయ్యాయి. ఈ టైంలో పర్సెంటేజీ అంటే ఎలా?. కాబట్టి ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలకు ఇవ్వలేం. జూన్ లేదా జులై మొదటి వారంలో ఒక మీటింగ్ పెట్టుకుందాం. థియేటర్లకి మెయింటనెన్స్ చార్జెస్ అని తీసుకుంటున్నారు. అవేమీ చేస్తున్నారో తెలియడం లేదు. బుక్ మై షోలో కన్వీనన్స్ ఛార్జ్ అని తీసుకుంటున్నారు. దాంట్లో సగం ఎగ్జిబిటర్లకు వస్తోంది. మాకు ఏం చేస్తారనేది కూడా మేం అడుగుతాం. వాటన్నిటికీ ఏం చేస్తారో చెప్తే.. ఇక నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకు అలాంటి కండిషన్స్ తో వెళ్లడానికి మాకేమీ ఇబ్బంది లేదు'' అని నాగవంశీ అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల ఓనర్స్ తో మాట్లాడుకుంటే సరిపోయేదని, దానికి ఇంత రచ్చ చేయాల్సిన పనిలేదన్నారు. ''సమ్మర్ సీజన్ లో జనాలు పెద్దగా థియేటర్లకు రావడం లేదు. ఐపీఎల్ ఎఫెక్ట్ పడిందా? సరైన కంటెంట్ లేదా? అనేది తెలియదు కానీ.. జనాలు రావడం లేదు. ఇప్పుడు 'పెద్ది' సినిమాతో థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే పెద్ద క్రేజ్ ఉన్న సినిమా. కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. పెద్ద హిట్టవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది. ఆ సినిమా హిట్టయితే జనాలు మళ్లీ థియేటర్లకు రావడం అలవాటు అవుతుంది. రాబోయే 6 నెలలకు కంటెంట్ రెడీగా ఉంది. అందుకే జనాలు థియేటర్లకు రావాలంటే 'పెద్ది'తో మంచి టేకాఫ్ జరగాలని, పెద్ది బాగుండాలని కోరుకోవాల్సిన టైంలో ఇండస్ట్రీలో ఈ న్యూసెన్స్ అవసరమా?'' అని నాగవంశీ అన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా 'పెద్ది' సినిమాని కనక ఆ 23 సింగల్ స్క్రీన్లలో ప్రదర్శించని పరిస్థితి వస్తే.. చిరంజీవి దగ్గరికి వెళ్తామని, రామ్ చరణ్ ని కలిసి విన్నవిస్తామని నాగవంశీ తెలిపారు.