రికార్డుల్లో పేరిట ఒక బుక్కే ఉంటుంది. ఏ రికార్డు చూసినా అందులో విరాట్ కోహ్లి ఉండాల్సిందే. కింగ్ పరుగుల దాహానికి రికార్డులు సలాములు కొట్టాల్సిందే. . ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. జోస్ బట్లర్ ఈ రికార్డును అందుకోవడానికి చూసినా కుదర్లేదు. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీ నమోదు చేశాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి వన్ మ్యాన్ షోతో 19.1 ఓవర్లలో విజయం సాధించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి, 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకూ క్రీజులోనే కొనసాగి నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి అత్యధికంగా తొమ్మిది సెంచరీలు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఇన్ని సెంచరీలు చేసిన బ్యాటర్ మరొకడు లేడు. 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి కోహ్లి 2016 వరకూ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2016లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. 2019లో ఒకటి, 2023లో రెండు, 2024లో ఒకటి చేశాడు. 2024 తర్వాత రెండేళ్ల గ్యాప్‌లో మళ్లీ ఈ ఏడాది మరో సెంచరీ చేసి మొత్తం 9 శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లి తర్వాత ఈ రికార్డుకు అతి చేరువగా వచ్చింది మాత్రం జోస్ బట్లరే. ఒకానొక సమయంలో సెంచరీల్లో కోహ్లిని అధిగమిస్తాడని అనుకున్నా అది సాధ్యపడలేదు. 2016లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన బట్లర్ 2021లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 2022లో 4 సెంచరీలు బాది కింగ్‌కి పోటీగా నిలిచాడు. 2024లో కూడా రెండు సెంచరీలు చేసి మొత్తం ఏడింటితో విరాట్ కోహ్లి తర్వాత అత్యధిక శతకాలు నమోదు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. 2024 తర్వాత బట్లర్ మరో సెంచరీ చేయలేదు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. విరాట్ కోహ్లి 9 శతకాలతో టాప్‌లో ఉన్నాడు. కోహ్లి ఈ 9 సెంచరీలను ఆర్సీబీ తరఫునే చేయడం విశేషం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్ 7 చేశాడు. కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన క్రిస్ గేల్ 6, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, లక్నో తరఫున కేఎల్ రాహుల్ 6, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సంజూ శాంసన్ 5, కేకేఆర్, గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్ 4, ఢిల్లీ, సన్‌రైజర్స్ తరఫున ఆడిన డేవిడ్ వార్నర్ 4, రాజస్థాన్, ఆర్సీబీ, సీఎస్కే తరఫున ఆడిన షేన్ వాట్సన్ 4 శతకాలతో ఈ లిస్టులో ఉన్నారు.