తెలంగాణ ప్రభుత్వం వాహనాల పార్కింగ్‌కు సంబంధించి కొత్త పాలసీని తీసుకురాబోతోంది. ఇకపై వాహనాలను ఎక్కబడితే అక్కడ పార్కింగ్ చేయడం, రోజుల తరబడి వాహనాలను రోడ్డు పక్కన నిలపడం వంటివి కుదరదు. ఇలా వాహనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.. అందుకే కొత్త రూల్స్ అమలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో వాహనాల పార్కింగ్‌ సహా ఇతర అంశాలకు సంబంధించి కొత్తగా ముసాయిదా పాలసీని రవాణాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఇటీవల సుప్రీం కోర్టు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సర్కార్ ఈ ముసాయిదాను ఆమోదించగానే ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు.. ఆ తర్వాతే అమలు చేయనున్నారుఈ ముసాయిదా ప్రకారం.. ఎవరైనా వాహనాలను రోడ్లపై వదిలేసి వెళితే గతంలో జరిమానా విధించేవారు.. ఇకపై అలా కాదు జరిమానాలతో పాటుగా వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. టోయింగ్ ఛార్జీలను కూడా వాహన యజమాని చెల్లించాల్సి ఉంటుంది.. అంతేకాదు ఆ వాహనాన్ని పోలీసుల దగ్గర ఉంచిన అన్ని రోజులకు పార్కింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ వాహనంపై ఏవైనా పెండింగ్ చలాన్లు ఉన్నా ఇతర డాక్యుమెంట్లకు సంబంధించి ఏవైనా జరిమానాలు ఉన్నా చెల్లించాల్సిందే. ఒకవేళ వాహన యజమాని నెల నుంచి 45 రోజుల్లో క్లెయిమ్ చేయకపోతే ఆ వాహనాన్ని వేలానికి పంపే అవకాశం ఉంటుంది. వాహనాలు ట్రాఫిక్‌కు ఇబ్బందిగా మారిన సమయంలో, బ్రేక్‌డౌన్ అయిన సందర్భంలో.. ఫుట్‌పాత్‌లపై, నో పార్కింగ్ జోన్లలో వాహనాల్ని టోయింగ్ చేయాలని రవాణాశాఖ ముసాయిదాలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఈ వాహనాలు టోయింగ్, పార్కింగ్ ఫీజులకు సంబంధించి కూడా రవాణాశాఖ ఛార్జీలను ప్రతిపాదించింది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా ఈ ఛార్జీలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ వాణాలను పార్క్ చేసేందుకు కొత్తగా పీపీపీ (ప్రభుత్వ ప్రైవేట్) భాగస్వామ్యంలో పార్కింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. ఈ వాహనాలకు నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను బట్టి రోజువారి పార్కింగ్ ఫీజులు నిర్ణయించిన్లు తెలుస్తోంది. బైక్‌లకు రోజుకు రూ.20 నుంచి 30, ఆటోలకు రూ.35 నుంచి 50, కార్లకు రూ.60 నుంచి 80, బస్సులకు రూ.200 నుంచి రూ.300 రోజుకు చెల్లించాలని ముసాయిదాల రవాణాశాఖ ప్రతిపాదించింది.