తిరుమలలో భక్తులకు వేగవంతంగా శ్రీవారి దర్శనం.. టీటీడీ ప్లాన్ సక్సెస్, ఎలాగంటే

Wait 5 sec.

తిరుమలలో కొద్దిరోజులుగా వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివస్తున్నారు. కొండపై ఎంత రద్దీ ఉన్నా సరే టీటీడీ చర్యలతో భక్తులకు దర్శనం వేగంగా పూర్తవుతోంది. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానతో సౌకర్యవంతమైన దర్శనం కల్పిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా.. తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రోడ్లు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో పరిస్థితుల్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాదు తిరుమలలో ఏర్పాటు చేసినచేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహం వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణమే అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.తిరుమలలో భక్తులు ఏ ప్రాంతంలో ఎక్కువసేపు వేచి ఉండకుండా క్యూ లైన్లను సమతుల్యం చేస్తున్నారు. అంతేకాదు అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించడం, తాగునీరు, పాలు, అన్నప్రసాదం, వైద్య సేవలు వేగంగా అందించడం వంటి చర్యలు సమన్వయంతో కొనసాగుతున్నాయి. టీటీడీ చేపట్టిన ఈ చర్యలతో దర్శన సమయ నియంత్రణ మెరుగుపడింది. డిజిటల్ మానిటరింగ్ ద్వారా నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో భక్తుల రద్దీని అంచనా వేసి.. అందుకు అనుగుణంగా భక్తులను విడతల వారీగా ముందుకు పంపించే విధానాన్ని అమలు చేస్తున్నారు. టీటీడీ చేపట్టిన చర్యలతో భక్తులు ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా దర్శనానికి వెళుతున్నారు.టీటీడీ అమలు చేస్తున్న ఆధునిక రద్దీ నిర్వహణ విధానాల వల్లే క్యూలైన్లలో భక్తుల రద్దీ తక్కువగా కనిపిస్తోంది. గతంలో మాదిరిగా భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలిచిపోయే పరిస్థితులు లేకుండా, సాంకేతిక ఆధారంగా టీటీడీ యంత్రాంగం సమన్వయంతో భక్తులను వేగంగా దర్శనానికి పంపిస్తున్నారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగిస్తున్నారు. టీటీడీ అధికారులు 24 గంటలూ భక్తులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అప్రమత్తంగా పనిచేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, పరిశుభ్రత, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు భక్తుల సహకారంతో తిరుమలలో దర్శన వ్యవస్థ మరింత సాఫీగా కొనసాగుతోంది. ప్రస్తుతం వేసవి రద్దీ ఉన్నా సరే వీకెండ్ రోజులైన శని, ఆదివారాల్లో దాదాపు 85 వేలమందికి పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అలాగే సాధారణ రోజుల్లో దాదాపు 75వేల మంది భక్తులకు పైగా దర్శనం చేసుకుంటున్నారు. మే 2వ తేదిన అత్యధికంగా 91,005 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మే 1 నుంచి 12 వరకు 9లక్షల27వేల 420మంది శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో తిరుమలలో 80 వేలమంది భక్తులు ఉంటే.. సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 24 గంటల సమయం పట్టేది. ఇప్పుడు 8 గంటల్లోనే దర్శనం పూర్తవుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కేవలం 2 గంటలలోపే దర్శనం పూర్తవుతోంది.