ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతుంటే.. మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత ఉంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తుండగా.. మరో 48 గంటల్లో బలపడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడుకు దగ్గరలో ఉంది.. ఇది వచ్చే రెండు రోజుల్లో ఈశాన్యంగా పయనించి బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచన చేశారు. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, గుర్తేడు మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నగరడోనలో 42.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే నంద్యాల జిల్లా కొత్తపల్లెలో 42.4 డిగ్రీలు, పోలవరం జిల్లా ఎర్రంపేటలో 42 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.9 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కంభంలో 41.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 41.3 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి, కడప జిల్లా జమ్మలమడుగులో 41.1 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 41 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిలో 40.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా రాయలపేటలో 40.5 డిగ్రీలు, ఏలూరు జిల్లా కుక్కునూరులో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఏపీలో రెండు, మూడు రోజుల్లో కోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మంగళవారం రోజు కోస్తాతో పాటుగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఎండతీవ్రతతో పాటుగా ఉక్కపోత కొనసాగాయి. అంతేకాదు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. అలాగే అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కూడా పడ్డాయి. మొత్తం మీద రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.