Gold Policy: ఒక ఏడాది పాటు బంగారం కొనడం ఆపేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునివ్వడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా పసిడి గురించే చర్చ నడుస్తోంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతానికి పెంచడంతో బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఇది పసిడి ప్రియులకు ఊహించని షాక్ అనే చెప్పాలి. . త్వరలోనే కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని అందుబాటులోకి తీసుకురాబోతోందని జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ పాలసీ ద్వారా మీ ఇంట్లో ఉన్న బంగారంపై వడ్డీ పొందే అవకాశం ఉంటుంది. మరి ఈ పాలసీ గురించి తెలుసుకుందాం. భారతీయుల వద్ద దాదాపు 30 వేల టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సదరు బంగారాన్ని వెలికితీసి దానిని ఆర్థిక వృద్ధికి ఉపయోగపడేలా చేయాలని కేంద్రం వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగంగానే కొత్త తీసుకొస్తున్నట్లు సమాచారం. అయితే, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది కొత్తదేమీ కాదు. 2015లోనే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే, ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. ఆ పథకానికి పలు కీలక మార్పులు చేసి కొత్త పాలసీని త్వరలోనే ప్రవేశపెట్టబోతున్నట్లు వార్తా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా మీ వద్ద ఎంత బంగారం ఉన్నా బ్యాంకులో పెట్టి వడ్డీ పొందవచ్చు. 1 గ్రాము, 10గ్రాములు, ఇలా ఎంతైనా డిపాజిట్ చేయవచ్చు. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగా ఈ స్కీమ్ పని చేస్తుంది. పన్ను మినహాయింపులు సైతం కల్పించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ ద్వారా 2000 టన్నుల వరకూ బంగారం డిపాజిట్ చేసేలా చూడాలని కేంద్రం ప్లాన్ వేస్తోందట. కనీస డిపాజిట్ వచ్చినా వచ్చే మూడేళ్ల వరకు మన దేశంలో బంగారం దిగుమతి అవసరమే ఉండదని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఉన్న గోల్డ్ మానిటైజేషన్ పాలసీలో కీలక మార్పులు చేయాలని ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఏంటి?చాలా మంది తమ బంగారాన్ని ఇంట్లోని బీరువాలో లేదా బ్యాంకు లాకర్లలో దాస్తుంటారు. బ్యాంకు లాకర్లలో దాస్తే భద్రత ఉంటుంది. అందుకు కొంత ఛార్జీ చెల్లించాలి. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015 నవంబర్ లో తీసుకొచ్చింది. ఇంట్లో పడి ఉండే బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చి ఉత్పాదకతను పెంచడమే ఈ స్కీమ్ ఉద్దేశం. ఇప్పుడు ఈపథకానికి మరిన్ని మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మీ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆభరణాలు, నాణేలు, బిస్కెట్లు, కడ్డీల రూపంలో ఉన్న ఏ బంగారాన్నైనా ఇవ్వొచ్చు. అయితే, ఆభరణాలలోని రాళ్లు, ఇతర లోహాలను తొలగించి స్వచ్ఛమైన బంగారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే మళ్లీ మీకు కావాల్సినప్పుడు మీ బంగారం కాకుండా అప్పటి ధరతో ఉన్న బంగారాన్ని ఇస్తారు. లేదా నగదు రూపంలోనైనా తీసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా నగ ఇస్తే అదే నగ రాదు. దానికి సమానమైన బంగారాన్ని ఇస్తారు. గోల్డ్ లోన్స్‌లో అలా ఉండదు. మన బంగారాన్ని భద్రంగా దాచి తిరిగి ఇస్తారు. ఇక్కడ విరుద్దంగా ఉంటుంది.