పసిడి ప్రియులకు ఊరట? సుంకాలు పెరిగినా.. దుబాయ్ నుంచి తక్కువ ధరకే బంగారం!

Wait 5 sec.

Gold Imports: దేశంలో పసిడి కొనుగోళ్లను తగ్గించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కఠిని నిర్ణయాలు తీసుకుంటోంది. బంగారం, వెండి సహా విలువైన లోహాల దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. ప్రస్తుతం కస్టమ్స్ డ్యూటీ 6 శాతంగా ఉండగా దానిని ఒకేసారి 15 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ధరలు పెరగడం వల్ల కొనుగోళ్లు తగ్గి దిగుమతులు తగ్గుతాయని కేంద్రం భావిస్తోంది. ప్రముఖ మేధో సంస్థ జీటీఆర్ఐ వెల్లడించింది. బంగారంపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల దిగుమతి చేసుకునే రూట్ మారుతుందని అభిప్రాయపడింది. దుబాయి నుంచి భారత్‌లోకి భారీగా బంగారం రావచ్చని, అందుకు ఇరు దేశాల మధ్య కుదురిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమే కారణమని పేర్కొంది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా అత్యంత ప్రాధాన్య దేశాల కంటే టారిఫ్ రేటు కోటా కింద 1 శాతం తక్కువకే బంగారం దిగుమతి చేసుకునేందుకు భారత్ అనుమతించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సాధారణ దిగుమతి సుంకం 15 శాతంగా ఉంది. అయితే దుబాయ్ నుంచి వచ్చే బంగారంపై ఈ సుంకం 14 శాతంగా ఉండనుంది. ఈ 1 శాతం వ్యత్యాసం కారణంగా వ్యాపారులు దుబాయ్ మార్గం ద్వారానే బంగారాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జీటీఆర్ఐ తెలిపింది. 2022లో దుబాయ్ మార్గంలో బంగారం దిగుమతులు 120 టన్నులుగా ఉండగా అది 2027 నాటికి 200 టన్నులకు చేరుతుందని అంచనా వేసింది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం బంగారం దిగుమతుల్లో దుబాయ్ వాటా నాలుగో వంతుకు చేరనుందని పేర్కొంది.వెండిపై 7 శాతమేఅయితే దుబాయ్‌తో కుదురిన ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి వచ్చే వెండిపై దిగుమతి సుంకం 7 శాతం మాత్రమే ఉంటుంది. ఈ 8 శాతం వ్యత్యాసం కారణంగా దుబాయ్ రూట్‌ నుంచి వెండి దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు జీటీఆర్ఐ తెలిపింది. 2031 నాటికి ఈ ఒప్పందం కింద వెండిపై సుంకం సున్నాకు చేరుకుంటుందని గుర్తు చేసింది. అంటే ఈ మార్గంలో భారీగా దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు చాలా క్లిష్టంగా ఉంటున్నట్లు జీటీఆర్ఐ అభిప్రాయపడింది. వాటిని సరళతరం చేసి అందరికీ అర్థమయ్యేలా మర్చాలని కోరింది. వివిధ సవరణలను పరిశీలిస్తే తప్ప అసలు ఎంత పన్ను కట్టాలో అర్థం కాని పరిస్థితులు నెలకొంటున్నాయని, దీనిని సులభతరం చేయాల్సిన అవసరం ఉందని కోరింది. పన్నుల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా మార్పులు చేసింది. పాత ఆదాయపు పన్ను చట్టంలోని సంక్లిష్ట పదాలను తొలగించి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025ని అమలులోకి తెచ్చింది. చాలా సెక్షన్లను విలీనం చేశారు. సాధారణ పదజాలాన్ని వినియోగించే ప్రయత్నం చేశారు. అయితే, జీటీఆర్ఐ ప్రకారం ఇంకా మార్చాల్సినవి చాలా ఉన్నట్లు అర్థమవుతోంది.