ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.. మోదీ సూచన ఫాలో కావాల్సిందే: విజయసాయిరెడ్డి

Wait 5 sec.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ.. వంటనూనెలు, పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గించుకోవాలంటూ హైదరాబాద్ పర్యటనలో దేశ ప్రజలను కోరారు.. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని సూచించారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన సూచనలు.. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో దిగజారిన నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలు ఫాలో కావాల్సిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.ఈ విషయాన్ని విశ్లేషిస్తూ ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.7కు పడిపోవటం ఆందోళన కలిగించే విషయమన్నారు రూపాయి విలువ మరింత దిగజారకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఎగుమతిదారులు లాభపడుతుండగా.. దిగుమతులు ఎంతో విలువైన విదేశీ మారక నిల్వలను తగ్గించి వేస్తున్నాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేసిన విజ్ఞప్తులు జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నాయని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.ప్రధాని మోదీ విజ్ఞప్తులను పాటించడం వలన 250 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు తగ్గుతాయని.. పెట్రోల్‌కు సంబంధించి 135 బిలియన్ డాలర్లు, బంగారానికి సంబంధించి 72 బిలియన్ డాలర్లు, వంటనూనెలకు సంబంధించి 19.5 బిలియన్ డాలర్లు, ఎరువులు 14.5 బిలియన్ డాలర్ల మేరకు దిగుమతులు తగ్గుతాయని.. మొత్తంగా 250 బిలియన్ డాలర్ల దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా మోదీ జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విజ్ఞప్తి చేశారన్నారు. ఉత్పత్తి పెంచటంతో పాటుగా దిగుమతులపై ఆధారపడటంపై ప్రస్తుతం దేశం దృష్టి పెట్టాలని విజయసాయిరెడ్డి సూచించారు. మరోవైపు మే 13వ తేదీన రూపాయి విలువ ఎన్నడూ లేని విధంగా 95.80 స్థాయికి దిగజారింది. ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభం సమయంలో 95.61 వద్ద ఆశాజనకంగా ప్రారంభమైనప్పటికీ, అమ్మకాల ఒత్తిడితో 95.80 స్థాయికి పతనమైంది. ఒకే రోజులో సుమారుగా 30 పైసలు క్షీణించడంపై మదుపర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.