సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యతో విబేధాల కారణంగా ప్రతీక్ మరణం యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఊపిరితిత్తులలోని రక్తనాళాల్లో పెద్దఎత్తున క్లాట్‌లు ఏర్పడి గుండె, శ్వాసకోశ వ్యవస్థ కుప్పకూలడం వల్లే మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. పోస్ట్‌మార్టమ్ నివేదిక ప్రకారం.. ‘‘భారీ పల్మనరీ థ్రోంబోఎంబోలిజం కారణంగా కార్డియోరెస్పిరేటరీ దెబ్బతింది’’ రక్తం గడ్డకట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ నిలిచిపోయి.. దీనివల్ల గుండె విఫలమైందని వైద్యులు చెప్పారు.తదుపరి పరీక్షల కోసం గుండె, ఊపిరితిత్తుల నుంచి గడ్డకట్టిన పదార్థాన్ని సేకరించి భద్రపరిచారని నివేదిక పేర్కొంది. విష ప్రయోగం జరిగిందా? అనేది నిర్దారించడానికి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్టు వైద్యులు తెలిపారు. అయితే, గడ్డకట్టడానికి ఖచ్చితమైన కారణం ఏంటి? మరణానికి ఇంకేమైనా బాహ్య కారకాలు దోహదపడ్డాయా? అనేది తెలియాల్సి ఉంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. అయితే ప్రతీక్ యాదవ్ శరీరంపై కనిపించే గాయాలు మరణానికి ముందు సంభవించాయి. కానీ, ఫోరెన్సిక్, ఇతర నివేదికలు వచ్చే వరకు ఆ గాయాల స్వభావానికి సంబంధించి ఎటువంటి నిర్ణయానికి రాలేమని వైద్యులు పేర్కొన్నారు.