Today: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా రోజుల తర్వాత కొనుగోళ్ల కళ కనిపిస్తోంది. ఇటీవల సూచీలు భారీగా కుదేలవగా.. మే 14 సెషన్‌లో ఎట్టకేలకు మంచి లాభాలు నమోదు చేస్తున్నాయి. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం 2 గంటలకు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ 1000 పాయింట్లు పుంజుకొని 75,600 మార్కు వద్ద కదలాడుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 300 పాయింట్లకుపైగా పెరిగి 23,750 స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఫార్మా స్టాక్స్ గురువారం సెషన్‌లో అదరగొడుతున్నాయి. సిప్లా 8 శాతానికిపైగా పెరగ్గా.. డాక్టర్ రెడ్డిసీ, లుపిన్, సన్ ఫార్మా ఇలా అన్నీ 3 శాతం వరకు పుంజుకున్నాయి. ఇంకా హెవీ వెయిట్ స్టాక్స్ రిలయన్స్, ఎస్బీఐ, ఎంఅండ్ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బీఎస్ఈ వంటి వాటిల్లోనూ భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ఇలా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నప్పటికీ ఒక స్టాక్ మాత్రం భారీగా పతనమైంది. అదే ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీ కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్. కిందటి సెషన్‌లో ఈ స్టాక్ ధర రూ. 4,178.40 వద్ద ముగియగా.. నేరుగా 10 శాతానికిపైగా నష్టంతో రూ. 3,760.60 వద్ద ఓపెన్ అయింది. ఇదే ఇంట్రాడే హై వాల్యూ. అక్కడి నుంచి మరింత పతనం అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో కేన్స్ టెక్నాలజీస్ షేర్ ధర ఏకంగా 20 శాతానికిపైగా పతనమై ఒక దశలో రూ. 3,332 వద్ద సెషన్ కనిష్ఠాన్ని తాకింది. ఇక్కడ చూస్తే షేర్ ధర ఒక్కరోజులోనే రూ. 850కిపైగా పడిపోయింది. ప్రస్తుతం చూస్తే 19 శాతం నష్టంతో రూ. 3,390 స్థాయిలో ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 7,705 కాగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ. 3,294.90 గా ఉంది. కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 22.73 వేల కోట్లుగా ఉంది. మార్కెట్ లాభాల్లో ఉన్నా.. ఈ స్టాక్ ఇవాళ ఇంతలా పతనం అయ్యేందుకు ప్రధాన కారణం క్యూ4 ఫలితాలే. అవును.. ఇటీవల కేన్స్ టెక్నాలజీస్ 2025-26 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. ఇక్కడ నికర లాభం 21 శాతం తగ్గి రూ. 91.22 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఇది రూ. 116.20 కోట్లుగా ఉండేది. ఇక కార్యకలాపాల ఆదాయం 26 శాతం పెరిగి రూ. 1242 కోట్లుగా వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ అంచనాల్ని అందుకోలేకపోయింది. సంస్థ రూ. 1700 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దానిని అందుకోకపోవడంతో పలు బ్రోకరేజీలు స్టాక్ టార్గెట్ ప్రైస్ తగ్గించేశాయి. ఈ క్రమంలోనే అమ్మకాల ఒత్తిడితో స్టాక్ ధర భారీగా పతనమైంది.