మొత్తానికి జాను కర్రసాము పోటీలో గెలిచి.. తండ్రి కలని నిజం చేసింది. ఆయన చేతులపై ఆంజనేయస్వామి వారికి అభిషేకం చేసే అదృష్టాన్ని దక్కించింది. ఈరోజు (మే 14) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్‌లో ఏమైందంటే.. ఊరి వాళ్లంతా జానుని పొగుడుతుంటే.. సూర్య తెగ సిగ్గుపడిపోతాడు. కత్తిని పొగుడుతుంటే సుత్తి సిగ్గుపడుతున్నట్టుగా.. మీరెందుకు తెగ సిగ్గుపడిపోతున్నారని అంటాడు తుఫాన్. ‘నా జాను గెలవడం అంటే.. నేను గెలిచినట్టే కదా.. నా జానుని పొగుడుతుంటే నన్ను పొగిడినట్టే అని అంటాడు సూర్య. కర్రసాము అంటే ప్రమాదకరమైన ఆట.. తెలిసి కూడా ఎందుకు వెళ్లావమ్మా అని అడుగుతాడు తండ్రి శంకరనారాయణ. ‘మీకోసమే నాన్నా.. ఈ హనుమంతుల వారికి అభిషేకం చేయాలనేది మీ ఆశ అని.. నానమ్మ చెప్పింది నాన్నా.. అందుకే ఇన్నేళ్ల తరువాత ఊరు వస్తున్న మీకు ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను’ అని అంటుంది జాను. అంత రిస్క్ ఎందుకు చేశావమ్మా.. నీకు ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? అని శంకరనారాయణ అంటే.. మాకోసం ఇంత కష్టపడుతున్నారు.. మీకోసం ఈ మాత్రం చేయలేనా? అని అంటుంది జాను. వీళ్లు చేయడం ఏమో కానీ.. ఎందుకొచ్చిన డ్రామారా బాబూ అనేట్టుగా అనిపిస్తుంది ఈ సీన్. ఎమోషన్ పండటం ఏమో కానీ.. ఈ నాటకీయం భరించడం కష్టమే అనేట్టుగా ఉంటుంది. మొత్తానికి శంకరనారాయణ ఫ్యామిలీ చేతుల మీదుగా ఆంజనేయుడికి అభిషేకం చేస్తారు. నలుగురి కూతుళ్లని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు శంకరనారాయణ. ఈ 20 ఏళ్లలో నేను ఏం కోల్పోయానో అర్థం అవుతుంది.. అయినా సరే నా పిల్లల భవిష్యత్ నాకు ముఖ్యం.పెద్దమ్మాయి పెళ్లి చేయాలి.. ఆ తరువాత జాను పెళ్లి.. గౌతమిని కలెక్టర్ చదివించాలి.. చిన్నదాన్ని చదివించాలి.. ఒక తండ్రిగా బాధ్యతలన్నీ దాటాలంటే.. కొన్నేళ్లు ఆ దుబాయ్‌లో ఉండటం తప్పదు అని అంటాడు శంకరనారాయణ. ఇతని వాలకం చూస్తుంటే.. బాధల్ని పంచుకోవడం ఏమో కానీ.. అక్కడకానీ సెకండ్ సెటప్ పెట్టేశాడా అనిపిస్తుంది ఆ డైలాగ్‌లు చూస్తే. 20 ఏళ్లుగా దుబాయ్‌లోనే ఉన్నారు. మీరు అక్కడా మేం ఇక్కడా ఏం జీవితాలండీ మనవి అని బాధపడుతుంది శారద. ఆ తరవాత స్వామి వారి పల్లకీ సేవలో పాల్గొంటారు శంకరనారాయణ, జానులు. మా ఊరి దేవుడు.. అందాల రాముడు అంటూ సాంగ్ వేసుకుంటారు. అటు జాను పల్లకి మోస్తుంటే.. ఇటు సూర్య మామ సింహాద్రి పిలిచి.. రారా పల్లకి మొయ్యి అని ఇస్తాడు. దాంతో అటు జాను, ఇటు సూర్య.. పల్లకి మోస్తారు. ఇక టైలర్ మురళి.. నందుని భార్యగా ఊహించుకుంటూ ఆమె కోసం దాచిన తాళి బొట్టుని చూస్తూ ఊహించుకుంటాడు. అలా కలకనగానే నందు ప్రత్యక్షం అయ్యి.. ‘ఆగలేను బావా తాళి కట్టేయ్.. కట్టేయ్’ అని అంటుంది. అయితే కట్టేస్తాను అంటూ నందు మెడలో తాళి కట్టేస్తాడు మురళి. ఆ తరువాత ఇద్దరూ సాంగ్ వేసుకుంటారు. కట్ చేస్తే.. గాల్లోనే ముడులు వేస్తుంటాడు మురళి. అంటే ఇదంతా అతను కన్న కల అన్నమాట. వాళ్ల అమ్మ వచ్చి రేయ్ ఏంట్రా అని అడిగితేనే కానీ.. మనోడు కలలో నుంచి బయటకు రాడు. పదరా.. ఇప్పుడే వెళ్లి నా తమ్ముడితో మాట్లాడి వద్దాం అని అంటుంది మురళి తల్లి. మామయ్య ఇప్పుడే కదా వచ్చిందీ.. తరువాత అడుగుదాంలే అని అంటాడు మురళి. దాంతో సరేరా.. రేపు వాళ్లందర్నీ మన ఇంటికి భోజనానికి పిలుద్దాం.. అప్పుడే మీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని అంటుందామె. అటు సూర్య.. జాను ప్రేమలో విహరించేస్తుంటాడు. ఆమెను ఊహించుకున్నాడో లేదో.. గోదారి పిల్ల జాను ప్రత్యక్ష్యం అయిపోతుంది. పరోటాల కోసం వస్తుంది జాను. ఆమెను చూడగానే పరుగు తీస్తాడు సూర్య. ఏంటీ నువ్వు ఇలా గాలికి తిరుగుతూనే ఉంటావా? అని జాను అంటే.. ‘మనం ఇన్నిసార్లు ఎందుకు ఎదురుపడ్డామో తెలుసా? ఇదో డెస్టినీ.. మ్యాజిక్.. డెస్టినీ మనకేదో చెప్పాలని చూస్తుంది’ అని అంటాడు సూర్య. చూడు బాబూ సుకుమారా.. ఒకే ఊరిలో ఉంటున్నాం కాబట్టి పొద్దున్న లేస్తే ఎదురుపడటం సహజం. దానికే నువ్వే డెస్టినీ గిస్టనీ అని అనకు అని గాలి తీసేస్తుంది జాను. సరే చూద్దాం.. నా డెస్టినీ కరెక్టో.. నీ ప్రాక్టికాలిటీ కరెక్టో చూద్దాం అని అంటాడు సూర్య. సరే చూద్దాంలే కానీ.. మీ విధిలో కుక్కలు ఎక్కువ కదా.. తొందరగా వెళ్లు లేదంటే కరుస్తాయ్ అని తుర్రమంటుంది జాను. ఇక రేపటి ఎపిసోడ్‌లో తన అక్క ఇంటికి వెళ్లిన శంకరనారాయణ.. ‘నేను వచ్చిందే వీళ్ల పెళ్లి చేయడం కోసం.. మురళితోనే నందు పెళ్లి అని చేతిలో చేయి వేసి మాట ఇస్తాడు. అయితే మురళి అంటే తనకి ఇష్టం లేదని జానుకి చెప్పడంతో.. మురళితో మాట్లాడుతుందామె. ఏం చేసిందో ఏంటో తరువాతి ఎపిసోడ్‌లో చూద్దాం.