అమెరికాలో తెలుగు యువకుడు సత్తా చాటారు.. కడప జిల్లా పులివెందులకు చెందిన ఇండియానా స్టేట్ లైసెన్స్‌డ్ అటార్నీ (న్యాయవాది) గా ప్రమాణ స్వీకారం చేశారు. సాయి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి కుమారుడు. అంతేకాదు శ్రీనివాస్ రెడ్డి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (TNSF) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డిని మంత్రి నారా లోకేష్ అభినందించారు. శ్రీనివాస్ రెడ్డి అమెరికాలోని ఇండియానా స్టేట్‌లో అటార్నీగా ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు జాతి గర్వించే విషయమన్నారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారని ప్రశంసించారు. 25 ఏళ్ల వయసులోనే మాస్టర్‌ ఆఫ్‌ లా పూర్తిచేశారని ట్వీట్ చేశారు. 'భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు. మన టీఎన్ఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పులివెందుల వాసి సాయి శ్రీనివాస్ రెడ్డి 25 ఏళ్ల వయసులో, తన మొదటి ప్రయత్నంలోనే అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో అధికారికంగా లైసెన్స్ పొందిన న్యాయవాదిగా (ఇండియానా స్టేట్ లైసెన్స్‌డ్ అటార్నీ) ప్రమాణ స్వీకారం చేయడం యావత్ తెలుగు సమాజానికి ఎంతో గర్వకారణం. శ్రీనివాస్ రెడ్డి కేవలం 25 ఏళ్లకే ఇండియాలో, అమెరికాలో లైసెన్స్ పొందారు. శ్రీనివాస్ రెడ్డి చాలా అరుదైన ఘనత సాధించారు' అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. భూమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలయన్స్ యూనివర్సిటీ నుంచి బీబీఏ, ఎల్‌ఎల్‌బీ (BBA, LLB).. అమెరికాలో మాస్టర్ ఆఫ్ లాస్ (LLM) చదివారు. అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో సమ్మర్ ప్రోగ్రామ్స్ కూడా చేశారు. శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో ఇండియానా బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.. ఇండియా, అమెరికాలో ఒకేసారి లీగల్ ప్రాక్టీస్ చేయడానికి అర్హత సాధించిన అతిపిన్న వయస్కుడిగా కూడా రికార్డు సృష్టించారు.భూమిరెడ్డి సాయిశ్రీనివాస్ తండ్రి రామ్‌గోపాల్ రెడ్డి విద్యార్థి నాయకుడిగా పనిచేశారు.. 1990 నుంచి 1994 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. 1996లో ఆయన టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. తెలుగు యువత ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం (అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పరిధి) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.