రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. మంత్రి పదవి కొట్టేసిన వైఎస్ వీరాభిమాని

Wait 5 sec.

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీకి సంబంధించిన ఏకైక తెలుగు నియోజకవర్గం యానాం ఎంతో ప్రత్యేకం. ఇక్కడి నుంచి ఆరోసారి గెలిచిన మల్లాడి కృష్ణారావుకు మరోసారి మంత్రి పదవి దక్కింది. ఇవాళ పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామి ప్రమాణ స్వీకారం చేశారు.. ఆయన ఏకంగా 5వ సారి సీఎంగా బాధ్యతల స్వీకరించారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కె కైలాస్‌నాథన్‌ వీరితో ప్రమాణం చేయించారు. పుదుచ్చేరి మంత్రిగా యానాం ఎమ్మెల్య ప్రమాణం చేశారు. మల్లాడి కృష్ణారావు ఎన్నార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్‌పై 4,568 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మల్లాడి కృష్ణారావు యానాం నుంచి ఏకంగా ఆరుసార్లు గెలిచారు.. నాలుగుసార్లు మంత్రి పదవి చేపట్టారు. ఆయన ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. మల్లాడి రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించారు. 1964 జూన్ 6లో యానాంలోని దరియాలతిప్ప జన్మించారు.. ఆయన ఇంటర్ వరకు చదివారు. ఆ తర్వాత సామాజిక కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చారు. మల్లాడి 1990-1992లో ఇళ్లు లేని ప్రజలకు లతన సొంత భూమిలో కొత్త హౌసింగ్ కాలనీలను ఏర్పాటు చేశారు. ఆయన ఓల్డ్ రాజీవ్ నగర్ అగ్నిప్రమాద కాలనీని నిర్మించి గొప్ప మనసు చాటుకున్నారు. 1996 నుంచి ఆయన వరుసగా 2016 వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు.. 2021 ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. మల్లాడి కృష్ణారావు 2006లో తొలిసారి పర్యాటక, స్థానిక పరిపాలన, గ్రామీణాభివృద్ధి, జిల్లా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో రెండోసారి రెవెన్యూ, ఎక్సైజ్, ఫిషరీస్, పర్యాటక మంత్రిగా పనిచేసిన సంగత తెలిసిందే. మల్లాడి కృష్ణారావు మూడోసారి 2016 నుంచి 2021 పుదుచ్చేరి వైద్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగోసారి మంత్రిగా ప్రమాణం చేశారు.మల్లాడి కృష్ణారావు 2021 ఎన్నికల్లో పోటీ చేయలేదు.. తాను రాజకీయాల నుండి కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. సామాజిక సేవకు తాను ప్రాధాన్యం ఇష్తానని చెప్పారు. అలాగే తన కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లోకి రారని కూడా ప్రకటించారు. ఆయన 2021లో తన మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేయలేదు. కానీ మల్లాడి 2021 ఎన్నికల్లో ఎన్.ఆర్. కాంగ్రెస్ (AINRC) అభ్యర్థి రంగస్వామి తరఫున ప్రచారం మాత్రం చేశారు.. కానీ రంగస్వామి స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 2021 ఎన్నికల తర్వాత మల్లాడిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. 2021 నుంచి 2026 మధ్య యానాంలో పాలన సరిగా లేదని అక్రమాలు జరిగాయని మల్లాడి కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పాలనకు ముగింపు పలకడంతో పాటుగా, ప్రత్యర్థులు సోషల్ మీడియా ద్వారా తనపై చేసిన దుష్ప్రచారాలను తిప్పికొట్టడానికి మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. యానాం ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడంతో పాటుగా నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి చేసేందుకు పోటీచేస్తానన్నారు. ఇటీవల జరిగిన (2026) ఎన్నిక ద్వారా మళ్లీ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆల్ ఎన్.ఆర్. కాంగ్రెస్ (AINRC) అభ్యర్థిగా యానాం నుంచి పోటీ చేసి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.. నాలుగోసారి మంత్రి అయ్యారు. మల్లాడి కృష్ణారావు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీరాభిమానిగా ఉన్నారు. మల్లాడి కృష్ణారావు 1997లో ఎవరూ లేని పేద వృద్ధుల కోసం, వసతి, ఆరోగ్యం సౌకర్యాలు ఉచితంగా అందించేందుకు యానాం వృద్ధాప్య గృహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు యానాంలో పేద, అనాథ బాలబాలిక విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, ప్రేమ, ఆప్యాయత, ఆరోగ్యం వంటి బాధ్యతల్ని కూడా తీసుకుని.. వారికి ఉచిత సౌకర్యాలు కల్పించారు. అంతేకాదు మల్లాడి కృష్ణారావు ఉత్తమ ఎమ్మెల్యేగా అవార్డులు అందుకున్నారు. యానాంలో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. మొత్తానికి మల్లాడి కృష్ణారావు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు మంత్రిగా రికార్డుల్లోకి ఎక్కారు.