‘దయచేసి అర్థం చేసుకోండి’.. చేతులు జోడిస్తూ రాజీవ్ కనకాల క్లారిటీ.. ‘ఆ స్కూల్‌తో నాకు సంబంధం లేదు.. నేను చీఫ్ గెస్ట్‌ని అంతే’

Wait 5 sec.

ఎంతైనా సెలబ్రిటీలు.. వాళ్లకేంట్రా బాబూ.. షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉంటారు. షూటింగ్‌లు లేకపోతే రిబ్బన్ కటింగ్‌లో బిజీ అవుతారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లు, ప్రమోషన్స్ కార్యక్రమాలు, స్కూల్- కాలేజ్ ఈవెంట్స్ ఇలా ఏదొక కార్యక్రమంతో బిజీగా ఉంటారు. అటు షూటింగ్‌లు ఇటు ఓపెనింగ్ కార్యక్రమాలతో రెండు చేతులా సంపాదిస్తారు. అయితే అంత సవ్యంగా జరిగినంతవరకూ ఏ ఇష్యూ ఉండదు. కానీ.. ఏదైనా ఇష్యూ అయ్యిందంటే.. అప్పుడుంటది రిబ్బన్ కటింగ్‌లు, సన్మానాల సంగతి. డబ్బులిస్తున్నారు కదా అని ఏ కార్యక్రమానికి పడితే ఆ కార్యక్రమానికి వెళ్తే.. తిప్పలు తప్పవు. అందులోనూ పాపులర్ సెలబ్రిటీలు వస్తున్నారంటే అందరి కళ్లు వాళ్లపైనే ఉంటాయి. ఎటునుంచి ఏమొస్తుందో తెలియదు. ఇప్పుడు యాంకర్ సుమ కనకాల భర్త కూడా ఇలాంటి వివాదంలోనే ఇరుక్కున్నారు. ఇటీవల ఆయన హైదరాబాద్‌లో ఉన్న వైబ్రాంట్ అనే స్కూల్‌‌ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లారు. అయితే అక్కడ నవ తెలంగాణ స్టూడెంట్ శక్తి (NVTS) ఆర్గనైజేషన్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. ఆ స్కూల్.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని.. అలాంటి స్కూల్‌ని ఎలా ప్రమోట్ చేస్తారంటూ నిలదీశారు. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ వీడియో విడుదల చేశారు రాజీవ్ కనకాల. ‘‘నేను ఈ మధ్య హైదరాబాద్‌లోని ఫంక్షన్‌కి చీఫ్ గెస్ట్‌గా వెళ్లాను. పేరెంట్స్‌తో ఇంటరాక్షన్, మంచి మార్కులు సంపాదించిన స్కూల్ పిల్లలకు నా చేతుల మీదుగా బహుమతులు అందజేశాను. సెలబ్రిటీ అనుకోండి.. తెలిసిన వ్యక్తి అనుకోండి.. మీలో ఒకడిగా అక్కడికి రావడం జరిగింది. దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ఆ సభలో నవ తెలంగాణ శక్తి (NVTS) ప్రెసిడెంట్ పవన్ గారు వచ్చి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఏవండీ రాజీవ్ గారూ.. మీకు ఈ స్కూల్ తాలూకా క్రెడిబిలిటీ మీకు తెలుసా? అన్నీ లీగల్‌గా ఉన్నాయో లేదో మీకు తెలుసా? ఈ రెసిడెన్షియల్ ఏరియాకి పర్మిషన్ ఉందో లేదో మీకు తెలుసా? అని అడిగారు. నాకు నిజంగా అవన్నీ తెలియదు. ఒక మంచి కార్యక్రమానికి, పిల్లల్ని ఉత్తేజపరిచే కార్యక్రమానికి వెళ్తున్నాననే సదుద్దేశంతోనే నేను అక్కడికి రావడం జరిగింది. కాబట్టి.. ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే పేరెంట్స్ అంతా ఆ స్కూల్ దగ్గరకు వెళ్లి కనుక్కోండి. NVTS వాళ్లు ఏవైతే అడిగారో.. అవన్నీ కనుక్కుని మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఇవన్నీ ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే.. నేను వైబ్రేంట్ స్కూల్ వాళ్లకి కూడా చెప్పడం జరిగింది. స్కూల్‌కి సంబంధించి నా ఫొటోలు కానివ్వండి.. నా వీడియోలు కానివ్వండీ.. పబ్లిసిటీ కోసం వాడొద్దని చెప్పాను. ఎందుకంటే.. నేను అక్కడికి వచ్చింది చీఫ్ గెస్ట్‌గా మాత్రమే. కాబట్టి చీఫ్ గెస్ట్‌గా వచ్చినప్పుడు ఆ స్కూల్‌ గురించి కాస్త పాజిటివ్‌గా మాట్లాడి ఉంటే ఉండొచ్చు. కాబట్టి వాటిని స్కూల్ ప్రమోషన్ కోసం వాడొద్దని చెప్పడం జరిగింది. నన్ను అలర్ట్ చేసినందుకు NVTS వాళ్లకి కూడా థాంక్స్. కాబట్టి NVTS వాళ్లు ఇలాంటివి ఏమైనా డౌట్‌లు ఉంటే వెళ్లి స్కూల్ యాజమాన్యాన్ని అడగండి’ అంటూ క్లారిటీ ఇచ్చారు రాజీవ్ కనకాల. అయితే ఈ ఇష్యూపై రాజీవ్ కనకాల ఇచ్చిన వివరణపై సదరు NTVS అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు. ‘‘NTVS లేవనెత్తిన ఆందోళనలను గుర్తించినందుకు రాజీవ్ కనకాల గారికి ధన్యవాదాలు. వైబ్రాంట్ స్కూల్ విషయంలో మీరు వెంటనే స్పందించినందుకు అభినందిస్తున్నాము. మీరు సెలబ్రిటీ కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది. మీ నిబద్ధత వందలాది మంది విద్యార్థులు ఒక విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. పారదర్శక విద్య కోసం మీరు ఒక దృఢమైన వైఖరిని తీసుకోవాలని మేము ఆశిస్తున్నాము’ అంటూ స్పందించారు. మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. డబ్బులిస్తాం అన్నారు కదా అని సెలబ్రిటీలు ఏ కార్యక్రమానికి పడితే ఆ కార్యక్రమానికి వెళ్లిపోతే.. ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి.