టీడీపీ ఎమ్మెల్యే మాధవి పీఏగా చేరిన ట్రాన్స్‌జెండర్‌కు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పదవి

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రాన్స్‌జెంండర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం ఐదుగురు సభ్యులుగా నియమించారు. ఆంధ్ర ప్రాంత ప్రతినిధిగా విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను నియమించారు. అలాగే రాయలసీమ ప్రాంత ప్రతినిధిగా తిరుపతి జిల్లా కలెక్టర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌జెండర్లకు ప్రతినిధులుగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రుకు చెందిన కోట ప్రేమ్‌సాగర్‌ రాయ్.. గుంటూరు జిల్లాకు చెందిన నక్క జీవన్‌కుమారి, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బోను దుర్గలను నియమించారు. రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతుంది.వీరిలో ట్రాన్స్‌జెండర్లకు ప్రతినిధులుగా నియమించిన వారిలో.. గుంటూరు జిల్లాకు చెందిన నక్క జీవన్‌కుమారి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు జీవన్‌కుమారికి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డులో గుంటూరుకు ప్రాతినిధ్యం దక్కడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే గళ్ళా మాధవి. ట్రాన్స్ జెండర్ల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ బోర్డుకు ప్రాంతీయ ప్రతినిధులుగా సభ్యులను నియమించగా.. గుంటూరు జిల్లా నుంచి నక్క జీవన్ కుమారి (వర్షిణి) ఎంపిక కావడం గర్వంగా ఉందన్నారు.తన దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నసేవా దృక్పథం, సామాజిక చైతన్యం, ట్రాన్స్ జెండర్ల సమస్యలపై అవగాహన కారణంగానే ఈ బాధ్యత దక్కిందన్నారు మాధవి. గుంటూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ ట్రాన్స్ జెండర్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ట్రాన్స్ జెండర్ల పట్ల వివక్ష తగ్గి గౌరవప్రదమైన స్థానం కల్పించే దిశగా ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. సమాజంలో ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవితం గడపాలని, వారికి విద్య, ఉపాధి, వైద్యం, నివాసం వంటి రంగాల్లో మరింత భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. ట్రాన్స్ జెండర్ల హక్కుల పరిరక్షణతో పాటు వారి అభివృద్ధికి సంక్షేమ బోర్డు కీలక వేదికగా మారుతుందని తెలిపారు. మొత్తం మీద ఎమ్మెల్యే గళ్ళా మాధవి దగ్గర పీఏగా చేరిన జీవన్‌కుమారికి ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదవిని కూడా ఇచ్చింది. ఎమ్మెల్యే మాధవి, జీవన్‌కుమారి ఇటీవల మంత్రి లోకేష్‌ను కలిసిన సంగతి తెలిసిందే.