ఐపీఎల్ 2026లో అదరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. డెత్ ఓవర్లలో పరుగులు ఇస్తాడు, పెద్దగా డాట్ బాల్స్ వేయలేడనే కారణాలతో ప్రధాన టోర్నీలకు సిరాజ్‌ను బీసీసీఐ పక్కనబెట్టింది. ఆ కోపంతోనే సిరాజ్ తానేంటో నిరూపించాలని ఐపీఎల్ 2026కు ముందు చాలా ప్రాక్టీస్ చేశాడు. తన డెడికేషన్ ఏంటో ఈ ఐపీఎల్‌లో నిరూపించి సెలెక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మియా భాయ్ బౌలింగ్ చేసి అందరికీ మైండ్ బ్లాంక్ అయింది. మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తే అందులో దాదాపు రెండు ఓవర్లు మేడిన్ చేశాడు. ఒక ఓవర్ పూర్తిగా మేడిన్ వికెట్ కాగా.. మరో ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ దక్కింది. ఇక మూడు ఓవర్లలో కలిపి కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈజీగా మ్యాచ్ గెలిచేసి ప్లే ఆఫ్స్ బెర్త్‌కి అతి దగ్గరగా వెళ్లాలి అనుకుంది. కానీ.. తొలి ఓవర్‌లోనే మొహమ్మద్ సిరాజ్ సన్‌రైజర్స్‌కి షాక్ ఇచ్చాడు. మొదటి బంతి నుంచే ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపాలని ప్రయత్నించిన సిరాజ్.. ఆ దిశగానే బౌలింగ్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌కు ట్రావిస్ హెడ్ సైతం స్టన్ అయ్యాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వేసిన బంతులు కీపర్ క్యాచ్‌గా వెళ్తాయని అందరూ అనుకున్నారు. తొలి మూడు బంతులు డాట్ కాగా.. నాలుగో బంతికి సిరాజ్ వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత రెండు బంతులను ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఎలాంటి పరుగులు తీయలేకపోయాడు. దాంతో మొహమ్మద్ సిరాజ్ తొలి ఓవర్‌లో మేడిన్ వికెట్ తీసుకున్నాడు. ఇక సిరాజ్ వేసిన రెండో ఓవర్‌లో తొలి బంతికే సమరన్ రవిచంద్రన్ ఫోర్ బాదగా.. ఐదో బంతికి ఇషాన్ కిషన్ మరో బౌండరీ బాదాడు. దాంతో ఆ ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండు సింగిల్స్‌తో పది పరుగులు వచ్చాయి. తన మూడో ఓవర్‌లో మొదటి ఐదు బంతులు కూడా వికెట్ టార్గెట్ గానే బౌలింగ్ చేశాడు. దాంతో కనీసం ఒక్క పరుగు కూడా రాలేదు. ఆఖరి బంతికి మాత్రం సింగిల్ వచ్చింది. దాంతో మూడు ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సిరాజ్‌తో పవర్ ప్లే లోనే మూడు ఓవర్లు వేయించడం విశేషం.