నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రమోషన్.. కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

Wait 5 sec.

చంద్రబాబు పూర్తిస్థాయిలో టీడీపీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు.. ఇటీవల పార్టీ కమిటీలను నియమించగా.. లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించారు. ఇటీవల ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమించిన వారికి తాజాగా వారు పర్యవేక్షించాల్సిన లోక్‌సభ నియోజకవర్గాల్ని కేటాయిస్తూ ప్రకటన విడుదల చేశారు. నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సితో పాటుగా పార్టీలో సీనియర్ నేతల్ని ప్రాంతీయ సమన్వయకర్తలుగా నియమించింది. ఈ మేరకు సమన్వయకర్తలకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల పరిధిలో నేతల్ని సమన్వయం చేసుకునే బాధ్యతను వీరికి అప్పగించారు. టీడీపీ అధిష్టానానికి, క్షేత్రస్థాయి నేతలకు మధ్య వీరంతా ప్రధాన సంధానకర్తలుగా వ్యవహరిస్తారు.టీడీపీ జోనల్‌ కో-ఆర్డినేటర్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీపురుపల్లి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు అనకాపల్లి, విశాఖపట్నం లోక్‌సభ స్థానాలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. సుజయ్‌ కృష్ణ రంగారావుకు కాకినాడ, అమలాపురం.. టీడీపీ సీనియర్ నేత మంతెన వెంకట సత్యనారాయణ రాజుకు చిత్తూరు, రాజంపేట, తిరుపతి.. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు శ్రీకాకుళం, విజయనగరం, అరకు.. చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు నర్సాపురం, ఏలూరు, రాజమండ్రి.. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుకు నెల్లూరు, ఒంగోలు లోక్‌సభ బాధ్యతలు అప్పగించారు.నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డికి కర్నూలు, నంద్యాల, కడప.. టీడీపీ నేత దామచర్ల సత్యకు అనంతపురం, హిందూపురం.. కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలు.. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడికి బాపట్ల, నరసరావుపేట లోక్‌‌సభ నియోకవర్గాలకు సంబంధించి జోనల్ కో ఆర్డినేటర్లుగా బాధ్యతలు అప్పగించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. టీడీపీ అధిష్టానం ఇటీవల పార్టీ కొత్త కమిటీలను నియమించింది. తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరోలో కొత్తవారికి అవకాశం కల్పించారు. ఈసారి ఇద్దరు సామాన్య కార్యకర్తలకు అవకాశం కల్పించారు. అలాగే యువతతో పాటుగా సీనియర్ నేతలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు.