నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం.. విద్యార్థుల భవిష్యత్‌ 'డీమానిటైజ్' అయిందన్న సీఎం రేవంత్ రెడ్డి

Wait 5 sec.

నీట్ యూజీ 2026 పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. పేపర్ లీక్ కావడంతో.. లక్షల మంది రాసిన నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా నీట్ పరీక్ష రద్దుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై పారదర్శకమైన విచారణను జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలు.. విద్యార్థులకు ద్రోహం.. వ్యవస్థీకృత అవినీతిలో బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య సారూప్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.నీట్ పరీక్ష రద్దు కావడంతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసిన 22.79 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పేపర్ లీక్‌ ఘటనలు.. విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతాయని.. వారి కెరీర్‌ను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షల నిర్వహణకు సంబంధించి.. విశ్వసనీయతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈనెల 3వ తేదీన దేశంలోని 551 నగరాల్లో.. విదేశాల్లోని 14 నగరాల్లో సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు.. పరీక్షకు హాజరయ్యారని.. ఇప్పుడు పేపర్ లీకులు, పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకల కారణంగా ఇప్పుడు మళ్లీ వారు తీవ్ర ఆందోళనలో పడినట్లు చెప్పారు. పేపర్ లీక్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. మరోసారి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయతను అన్ని విధాలుగా కాపాడాలని సూచించారు. ప్రశ్నపత్రాల లీకులు లేదా అవినీతికి పాల్పడిన ఏ వ్యక్తి అయినా నెట్‌వర్క్‌ అయినా.. వారి పలుకుబడి లేదా హోదాతో సంబంధం లేకుండా అత్యంత కఠినమైన శిక్షను ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ పేపర్ లీకేజీ ఘటనతో ప్రభావితం అయిన విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నీట్‌ రాసే విద్యార్థులు ఎన్నో త్యాగాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక భారాన్ని తట్టుకుని.. మరీ పరీక్షకు సిద్ధమవుతారని.. ఈ నేపథ్యంలోనే పోటీ పరీక్షలు విద్యార్థుల ఆందోళన, అనిశ్చితికి కాకుండా.. అవకాశాలు, ప్రతిభకు సాధనాలుగా మారాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్టమైన రక్షణ చర్యలు, టెక్నికల్ సెక్యూరిటీ, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.