తనను, తనతో సన్నిహితంగా ఉండే మహిళను సమాజంలో చులకన చేసి మాట్లాడుతున్నాడనే కక్షతో ఓ యువకుడు వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. యూట్యూబ్‌లో హత్యలు ఎలా చేయాలి? ఆయుధాలు ఎలా తయారు చేయాలి? అనే వీడియోలను చూసి.. పక్కా స్కెచ్‌తో ప్రత్యర్థిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ దారుణ హత్య ఉదంతాన్ని కరీంనగర్ పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుడిని కటకటాల వెనక్కి పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకుశాపూర్ గ్రామానికి చెందిన గంగరాపు మహేష్‌కు వ్యవసాయ భూమి ఉంది. అతని భూమి పక్కనే గ్రామానికి చెందిన ఓ వివాహిత కౌలుకు భూమిని తీసుకుని వ్యవసాయం చేస్తోంది. ఈ క్రమంలో పొరుగు పొలాల వారు కావడంతో మహేష్‌కు, సదరు వివాహితకు మధ్య పరిచయం ఏర్పడి అది కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే, ఇదే గ్రామానికి చెందిన మొగిలి అనే వ్యక్తి ఆ వివాహితపై కన్నేసాడు. గతంలో ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీనిపై సదరు వివాహిత స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మొగిలిని జైలుకు పంపారు.కొన్ని రోజుల క్రితం జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మొగిలిలో పగ మరింత పెరిగింది. తనను జైలుకు పంపిన వివాహితను, ఆమెతో సన్నిహితంగా ఉండే గంగరాపు మహేష్‌ను టార్గెట్ చేశాడు. వారిద్దరి అక్రమ సంబంధాన్ని ప్రస్తావిస్తూ ఊరిలో అందరి ముందు అనుచిత వ్యాఖ్యలు చేయడం, కించపరచడం మొదలుపెట్టాడు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య తీవ్ర మనస్పర్థలు, గొడవలు జరిగాయి. తనను, తనతో ఉండే మహిళను నిత్యం అవమానిస్తున్న మొగిలిని ప్రాణాలతో ఉంచకూడదని ఎలాగైనా అంతమొందించాలని మహేష్ డిసైడ్ అయ్యాడు.హత్య చేయడానికి ముందే మహేష్ పక్కా ప్రణాళిక రచించాడు. పోలీసులకు దొరకకుండా ఎలా హత్య చేయాలనే ఉద్దేశంతో తన మొబైల్ ఫోన్‌లోని యూట్యూబ్‌లో వరుసగా క్రైమ్ వీడియోలను వెతికాడు. హత్య చేసే విధానాలు, ఆయుధాలు తయారు చేసే టెక్నిక్స్‌ను క్షుణ్ణంగా వీక్షించాడు. ఆదివారం రాత్రి సమయం కోసం కాచుకుని కూర్చున్నాడు. మొగిలి మడిపల్లి గ్రామంలో జరుగుతున్న పీర్ల పండుగకు హాజరయ్యాడు. పండుగ ముగిసిన అనంతరం అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా సైకిల్‌పై తిరిగి అంకుశాపూర్ వస్తున్నాడు. ఇదే అదనుగా భావించిన మహేష్.. చీకట్లో రోడ్డుపై బైక్‌తో కాపుకాశాడు. సైకిల్‌పై వెళ్తున్న మొగిలిని వెనుక నుంచి భారీ ఇనుప రాడ్డుతో తలపై బలంగా బాదాడు. తీవ్రమైన గాయం కావడంతో మొగిలి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకొని ఘటనా స్థలానికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యుల అనుమానాలు, కాల్ డేటా ఆధారంగా మహేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, రక్తపు మరకల బట్టలు, బైక్, క్రైమ్ వీడియోలు చూసిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.