: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ నడుస్తోంది. అయితే ఒకవైపు కొత్త రిటర్న్స్ దాఖలు చేస్తుండగానే, మరోవైపు గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించి ఐటీ శాఖ నుంచి చాలా మందికి నోటీసులు వస్తున్నాయి. ముఖ్యంగా సెక్షన్ 143 (2) కింద వస్తున్న ఈ నోటీసుల్ని చూసి టాక్స్ పేయర్లు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ నోటీస్ ఎందుకు వస్తుంది? దీని అర్థం ఏంటి.. అసలు దీనికి ఎలా సమాధానం ఇవ్వాలనే దాని గురించి సింపుల్‌గా చూద్దాం. అసలు సెక్షన్ 143 (2) నోటీస్ ఎందుకు వస్తుంది?ఆదాయంలో వ్యత్యాసాలు: మీరు ఐటీ రిటర్న్స్‌లో చూయించిన ఆదాయానికి, మీ ఏఐఎస్ (వార్షిక సమాచార నివేదిక) లేదా ఫారం 26AS లో ఉన్న డేాటాకు తేడాలు ఉంటే ఈ నోటీస్ వస్తుంది. భారీ లావాదేవీలు: బ్యాంక్ అకౌంట్లలో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డిపాజిట్లు చేసినా లేదా షేర్లు/ఆస్తులు కొనుగోలు చేసినప్పుడు వాటి వివరాలు ఐటీఆర్‌లో సరిగ్గా చూయించకపోతే ఐటీ శాఖ ఏఐ సిస్టమ్స్/అనలిటిక్స్ ఈ నోటీసుల్ని ఆటోమేటిక్‌గా జనరేట్ చేస్తాయి. పరిశీలన: మీ టాక్స్ ఫైలింగ్‌ను మరింత లోతుగా పరిశీలించేందుకు ఐటీ శాఖ మీ నుంచి కొన్ని ఆధారాలు లేదా బిల్లుల్ని కోరుతుంది. అసలు ఈ నోటీస్ వస్తే ఏం చేయాలి?ఐటీ శాఖ నుంచి నోటీసులు వస్తే అసలు కంగారు పడొద్దు. నోటీసును క్షుణ్ణంగా పరిశీలించాలి. అసలు లైట్ తీసుకోవద్దు. నిర్లక్ష్యం చేస్తే భారీగా పెనాల్టీ పడుతుందని గుర్తుంచుకోవాలి. నోటీసు వచ్చిన 30 రోజుల్లోగా ఆన్‌లైన్ ద్వారానే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఐటీ పోర్టల్‌లో పెండింగ్ యాక్షన్స్ నుంచి ఇ- ప్రొసీడింగ్స్‌లోకి వెళ్లి సమాధానం ఇవ్వాలి. అవసరమైన బ్యాంక్ స్టేట్‌మెంట్లు, బిల్లుల్ని సిద్ధం చేసుకోవాలి. కంగారు పడి తప్పుడు వివరాలు లేదా నకిలీ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయొద్దు. అనుభవం లేకపోతే సొంతంగా ట్రై చేయకుండా సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) సలహా తీసుకోండి.ఆదాయపు పన్ను శాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగానే టాక్స్ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు. ఎవరి ఆదాయ వనరుల్ని బట్టి వారు వేర్వేరు ఐటీఆర్ ఫారంలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా రూ. 50 లక్షల్లోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఐటీఆర్-1, రూ. 50 లక్షలకంటే ఎక్కువ ఉన్న వారికి ఐటీఆర్- 2 వర్తిస్తుంది. వ్యాపారం చేసే వారికి ఐటీఆర్- 3, చిన్న వ్యాపారులకు ఐటీఆర్- 4 ఉంటుంది.