దొంగతనం చేసిందంటూ.. ఎనిమిదేళ్ల బాలికకు ఒళ్లంతా వాతలు, చిత్రహింసలు పెట్టిన పాస్టర్

Wait 5 sec.

దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ చిన్నారిని చిత్రహింసలు పెట్టాడో పాస్టర్. తనకేం తెలియదని మొరపెట్టుకున్నా వినకుండా ఒళ్లంతా వాతలు పెట్టి కనికరం లేకుండా వ్యవహరించాడు. చిన్నారి కేకలు పెడుతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నా ఆ కర్కోఠకుడికి కనికరం పుట్టలేదు. ఈ అమానుష ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగు చూసింది. అల్లూరి జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలోని ఏనుగుబయలు గ్రామానికి చెందిన గిరిజన దంపతులు తమ ఎనిమిదేళ్ల కుమార్తెను ఓ పాస్టర్ ఇంట్లో పనికి పంపించారు. ఆ బాలిక పాస్టర్ జయరాజ్ ఇంట్లో పది నెలలుగా పనిచేస్తూ అక్కడే ఉంటుంది. అయితే, ఇటీవల పాస్టర్ ఇంట్లో కొంత నగదు మాయమైంది. ఎవరు తీశారు ఏంటీ అన్న వివరాలు తెలుసుకోకుండానే పాస్టర్ కుటుంబం ఆ బాలికను దొంగను చేసింది. ఇంట్లో పోయిన డబ్బు గురించి బాలికను అడగ్గా తనకేమీ తెలియదని చెప్పింది. డబ్బులు తాను తీయలేదని చెప్తున్నా వినకుండా ఆ బాలిపై పాశవికంగా ప్రవర్తించారు. పాస్టర్ ఆమెను చాలా రకాలుగా ప్రశ్నించి.. విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగకుండా వంటిట్లోకి తీసుకెళ్లి అట్లకాడతో కాల్చి చిన్నారి చేతులపై వాతలు పెట్టాడు. ఆ మంట తట్టుకోలేక పాప కేకలు పెట్టినా కనికరించకుండా ఇంకాస్త ఎక్కువ కొట్టాడు. పాస్టర్ ఇంటి నుంచి తల్లిదండ్రుల దగ్గరకు చేరుకున్న బాలిక ఏడుస్తూ అక్కడ జరిగిందంతా చెప్పింది. కూతురు శరీరంపై కాలిన గాయాలు, వాతలు చూసి ఆ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పాస్టర్ దగ్గరికి పంపితే ఇలా చిత్రహింసలు పెడతారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు కూడా బాలిక ఒంటిపై గాయాలు చూసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని చెప్పారు. బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తల్లిదండ్రులు పాస్టర్ ఇంట్లో జరిగిందంటూ వివరించారు. ఈ అమానుష ఘటనకు సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. పాస్టర్ జయరాజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. బాలిక వయస్సు కూడా ఎనిమిదేళ్ల కావడంతో ఇది బాలకార్మికుల చట్టం కిందికి కూడా వచ్చే అవకాశం ఉంది.