మహారాష్ట్ర సీఎంను కలిసి థ్యాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశారు. ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో సమావేశమైన పవన్, ఫడ్నవీస్‌లు.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి రెండు ఆడపులులను ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా.. పవన్ సీఎం ఫడ్నవీస్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలలో పరస్పరం మరింత సహకరించుకోవాలని పవన్, ఫడ్నవీస్‌లు నిర్ణయించారు.ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తూర్పు కనుమలలో ఆడ పులుల సంఖ్య గణీనీయంగా తగ్గిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. అందుకే పులుల సంఖ్య పునరుద్ధరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకున్నామని.. ఏపీకి రెండు ఆడ పులుల్ని ఇచ్చేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చే ఆడ పులులు తూర్పు కనుమల్లో ప్రవేశంతో అంతరసంతానోత్పత్తి (Inbreeding) సమస్యల్ని అధిగమించొచ్చన్నారు. అంతేకాదు జన్యు వైవిధ్యం పెరిగి, పులుల సంఖ్య దీర్ఘకాలిక స్థిరత్వానికి దోహదపడుతుందన్నారు. తూర్పు కనుమలలో పులుల ఆవాస వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సంరక్షణ కార్యాచరణ శాస్త్రీయ విధానాలు, స్థిరమైన వన్యప్రాణి నిర్వహణ ఆధారంగా జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్న విషయాన్ని ప్రతిబింబిస్తోందన్నారు పవన్ కళ్యాణ్. 'ఆంధ్రప్రదేశ్–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం తూర్పు కనుమలలో పులుల దీర్ఘకాలిక సంరక్షణకు విశేషంగా దోహదపడుతుందని విశ్వసిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మాకు నిరంతరం మార్గదర్శకత్వం అందిస్తున్న కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ లక్ష్యాల సాధనలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, ఇతర భాగస్వామ్య సంస్థలతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు వెళ్తాము' అన్నారు పవన్ కళ్యాణ్. మహారాష్ట్ర నుంచి ఏపీకి త్వరలోనే రెండు ఆడపులులు వస్తుండటంతో ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం లభించింది.