: భారత్‌కు చెందిన దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ (APSEZ) అంతర్జాతీయ మార్కెట్లో ఒక భారీ డీల్‌కు తెరలేపింది. కేరళలోని తన వ్యూహాత్మక విజింజం అంతర్జాతీయ పోర్టులో 49 శాతం వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్పింగ్ దిగ్గజం ఎంఎస్‌సీకి చెందిన టీఐఎల్‌కు (టెర్మినల్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్) విక్రయించనుంది. ఈ డీల్ విలువ ఏకంగా 1.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో చూస్తే రూ. 13 వేల కోట్లకుపైనే ఉంటుంది. అసలు ఈ డీల్ వెనుక అసలు కారణాలు, దీని వల్ల అదానీ పోర్ట్స్‌కు వచ్చే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటా ఎందుకు అమ్ముతోంది?కేరళ విజింజం పోర్ట్ భారతదేశంలోనే మొట్టమొదటి డీప్ వాటర్ ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్. ప్రపంచంలోనే నంబర్ 1 షిప్పింగ్ అయినటువంటి MSC భాగస్వామిగా రావడం వల్ల ఈ పోర్టుకు అంతర్జాతీయ ఓడల ట్రాఫిక్ భారీగా పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే .. ముంద్రా, ఎన్నూర్ పోర్టుల్లో ఎంఎస్‌సీ గ్రూప్‌తో సంయుక్త భాగస్వామ్యాల్ని కలిగి ఉంది. ఇదే సమయంలో ఈ డీల్ ద్వారా వచ్చే రూ. 13 వేల కోట్ల నిధుల్ని అదానీ గ్రూప్ తన ఇతర పోర్టుల విస్తరణకు లేదా అప్పులు తగ్గించుకునేందుకు వాడుకునే అవకాశం ఉంది.లాభాల్లో అదానీ పోర్ట్స్ షేరు..డీల్ ప్రకటన నేపథ్యంలో అదానీ పోర్ట్స్ షేరు మంగళవారం సెషన్‌లో లాభపడుతోంది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో మధ్యాహ్నం 1.20 గంటలకు 1.50 శాతం పెరిగి రూ. 1803 స్థాయిలో ఉంది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 4.15 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 1857.80 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 1290.50 గా ఉంది. గత 6 నెలల్లో ఈ స్టాక్ 23 శాతం పెరిగింది.సాధారణంగా అదానీ గ్రూప్ ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంది. ఇతర కంపెనీల్లో వాటాల్ని కొనుగోలు చేస్తుంటుంది. ఇటీవలి కాలంలో ఇలాంటి డీల్స్ చాలానే చూశాం. కొద్ది రోజుల కిందట జై ప్రకాశ్ అసోసియేట్స్‌ను దక్కించుకుంది. దానికి ముందు సిమెంట్ సెక్టార్‌లో చూస్తే పెన్నా సిమెంట్, ఓరియెంట్ సిమెంట్, సంఘీ ఇండస్ట్రీస్ సహా ఇతర విద్యుత్, ఇంధన రంగాల్లో; ఓడరేవులు, లాజిస్ట్రిక్స్ విభాగాల్లో కూడా పలు కంపెనీల్లో మెజార్టీ వాటాల్ని దక్కించుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు సడెన్‌గా తన కంపెనీలో వాటా విక్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.