దేశంలోకి చొరబడుతున్న అక్రమ వలసదారుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో.. తెలంగాణ నిఘా వర్గాలు క్షేత్రస్థాయిలో జరిపిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొరుగు దేశాల నుంచి అక్రమ మార్గాల్లో సరిహద్దులు దాటి వేలల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిఘా సంస్థలు, ఇమిగ్రేషన్ బ్యూరో, రాష్ట్ర పోలీస్ విభాగాలు సంయుక్తంగా సేకరించిన ప్రాథమిక లెక్కల ప్రకారం.. ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు 20 వేల మందికి పైగా అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు తేలింది. వాస్తవంలో ఈ సంఖ్య రికార్డుల కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.అధికారుల సేకరించిన నివేదికల ప్రకారం.. నగరంలో నివసిస్తున్న సుమారు 9,500 వరకు ఉంది. ఇక బంగ్లాదేశ్ దేశానికి చెందిన వారు అధికారికంగా కేవలం 40 మంది మాత్రమే రికార్డుల్లో ఉండగా.. అనధికారికంగా చొరబడిన వారి సంఖ్య 4 వేలకు పైనే ఉందని తెలుస్తోంది. వీరితో పాటు వివిధ ఆఫ్రికా దేశాలకు చెందిన వలసదారులు 1400 మందికి పైగా ఉన్నారు. బతుకుదెరువు కోసం వచ్చిన వారిపై మానవతా దృక్పథం చూపినప్పటికీ, అక్రమ చొరబాట్లు చట్టరీత్యా నేరం కాబట్టి వీరిని తిరిగి స్వదేశాలకు పంపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల వలసదారులలో కొందరు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యాపారంలో మునిగితేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ అధికారులు జరిపిన నిఘా ఆపరేషన్లలో 2025లో 24 మంది ఆఫ్రికన్లను డ్రగ్స్ కేసులలో అరెస్టు చేశారు. పాత వారితో కలుపుకుని మొత్తం 42 మందిని ఇప్పటికే డిపోర్టేషన్ ద్వారా వారి దేశాలకు పంపించివేశారు.బంగ్లాదేశ్, మయన్మార్ వంటి సరిహద్దు దేశాల నుంచి వచ్చే చొరబాటుదారులు సాధారణంగా సరిహద్దు రాష్ట్రాల్లోనే ఆవాసం పొందుతారు. కానీ, దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబైలతో పోలిస్తే హైదరాబాద్‌లో జీవన వ్యయం చాలా తక్కువగా ఉండటం, పైగా ఇక్కడ ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతుండటంతో వారంతా భాగ్యనగరం బాట పడుతున్నారు. మరికొందరు విద్య, వైద్యం, వ్యాపార వీసాలపై అధికారికంగానే ఇక్కడికి వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో వీరి ఆచూకీ కనిపెట్టడం ఇమిగ్రేషన్ బ్యూరోకు కష్టంగా మారింది. రాజకీయ రంగు వద్దు.. జాతీయ భద్రతే ముఖ్యం: తెలంగాణ జనసేన హైదరాబాద్‌లో రోహింగ్యాలు, ఇతర దేశాల అక్రమ వలసలపై తెలంగాణ జనసేన పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 'హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వేలాదిగా రోహింగ్యాలు నివసించడం జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు. అక్రమ వలసలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, నకిలీ గుర్తింపు పత్రాల తయారీ వల్ల మన ప్రభుత్వ వ్యవస్థలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మోసపూరితంగా పొందిన ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలను తక్షణమే స్క్రీనింగ్ చేసి రద్దు చేయాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడకుండా.. దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయంగా పరిగణించి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు.