భారత్ - పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు దేశాల దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నెత్తురు, నీరు కలిసి ప్రవహించలేవు అనే వైఖరిని భారత్ కనబరుస్తోంది. దీంతో ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతోపాటు . అయితే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి, సంబంధాలను తిరిగి గాడిన పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ - పాకిస్థాన్‌‌కు చెందిన 117 మంది ప్రముఖులు ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్‌లకు బహిరంగ లేఖ రాశారు.భారత్ - పాక్ మధ్య శాంతి నెలకొల్పే విధంగా చర్చలు, ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రముఖులు విజ్ఞప్తి చేశారు. ఈ లేఖను సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ విడుదల చేసింది. దీనిపై భారత్‌కు చెందిన 61 మంది, పాకిస్థాన్‌కు చెందిన 56 మంది ప్రముఖులు సంతకాలు చేశారు. ఈ మధ్యే పాక్ కొత్త ప్రాపగండాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే భారత్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండించింది.ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న టెన్షన్స్‌తో కోట్లాది మంది యువత అవకాశాలు, అభివృద్ధి, భవిష్యత్ దెబ్బతింటోందని వారు లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికైనా శ్రతుత్వానికి ముగింపు పలికి ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. లేఖలో వారు ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేశారు.భారత్ - పాక్ ప్రభుత్వాలకు చేసిన సూచనల్లో ముఖ్యమైనవి.. ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలి.న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లో హైకమిషనర్లను తిరిగి నియమించాలి. సాధారణ వీసా సేవలు పునఃప్రారంభించాలి.వాణిజ్య విమానాల కోసం గగనతలాన్ని తిరిగి తెరవాలి.అట్టారి-వాఘా సరిహద్దును వాణిజ్యం, ప్రయాణాల కోసం మళ్లీ ప్రారంభించాలి.శ్రీనగర్ - ముజఫరాబాద్ బస్సు సర్వీసును తిరిగి ప్రారంభించాలి.ఏ రాజకీయ పార్టీకి తాము మద్దతు తెలపడం లేదని, దాదాపు 200 కోట్ల మంది ప్రజల సంక్షేమం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కోరుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ తరఫున సంతకాలు చేసిన ప్రముఖుల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, కశ్మీర్ మత, రాజకీయ నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్, ఆర్జేడీ రాజ్యసభ సభ్యుడు మనోజ్ ఝూ, ఏజేయూపీ నాయకుడు, టీఏంసీ మాజీ మంత్రి హుమాయున్ కబీర్ ఉన్నారు. పాకిస్థాన్ తరఫున పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్మూద్ కసూరీ, మాజీ దౌత్యవేత్త అష్రఫ్ జహంగీర్ ఖాజీ, పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు ఇస్పన్యార్ భండారా, అణు భౌతిక శాస్త్రవేత్త, రచయిత పర్వేజ్ హుడ్‌భాయ్ తదితరులు ఉన్నారు.