: గత నాలుగు రోజులుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్లను కంగారు పెట్టిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ షేరు ఈ రోజు ఊహించని రీతిలో పుంజుకుంది. సడెన్‌గా ఇంత పెరగడం చూసి ఇన్వెస్టర్లే ఆశ్చర్యపోయారు. జులై 1 న (బుధవారం) ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే రికార్డు స్థాయిలో ఎగబాకింది. తొలుత 5 శాతం, తర్వాత 10 శాతం అప్పర్ సర్క్యూట్లు కొట్టి ఇంట్రాడేలో అంతకుమించి కూడా దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్రాడేలో ఏకంగా 18 శాతానికిపైగా పెరిగి రూ. 29.40 వద్ద సెషన్ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం (మధ్యాహ్నం 2.10 గంటలకు) మాత్రం కాస్త వెనక్కి తగ్గి 14 శాతం లాభంతో రూ. 28 స్థాయిలో ఉంది. సంస్థ మార్కెట్ విలువ రూ. 11.49 వేల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 70.90 గా ఉండగా, కనిష్ఠ ధర రూ. 20.17 గా ఉంది. రిలయన్స్ పవర్ స్టాక్ బుధవారం రోజు ఈ స్థాయిలో పెరగడానికి కంపెనీ చేసిన ప్రకటనే కారణం. ఈ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇది రిలయన్స్ పవర్ స్టాక్‌ను బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసింది. దీంతో ఇందులో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాల పంట పండింది. ఇంతకీ ఏం ప్రకటన చేసిందనేది తెలుసుకుందాం. రిలయన్స్ పవర్ తన అనుబంధ సంస్థల ద్వారా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డేటా సెంటర్లకు అవసరమైన క్లీన్ ఎనర్జీని (గ్రీన్ పవర్) సరఫరా చేసేందుకు కొత్త ప్రాజెక్టుల్ని ప్లాన్ చేస్తుందన్న వార్తలు మార్కెట్లోకి వచ్చాయి. ఈ మేరకు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ో తెలిపింది. ఇప్పటికే తన సబ్సిడరీల్లో 4 కంపెనీల పేర్లను కూడా మార్చేసింది. వాటిని రిలయన్స్ ఏఐ గ్రీన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ డేటా కంట్రోల్ ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్ ఏఐ డేటా సి ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చింది. దీంతో ఒక్కసారిగా రిలయన్స్ పవర్ షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. గత కొంత కాలంగా భారీగా పడిపోయిన స్టాక్‌ను కనిష్ఠ స్థాయిల్లో బయ్యర్లు కొనేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు అనిల్ అంబానీ కంపెనీలు ఇటీవల అప్పుల్ని సున్నాకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తుండటం కూడా కలిసొచ్చింది. ఇవన్నీ ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్‌ను నింపిందని సమాచారం. Reliance Power Q4 Results రిలయన్స్ పవర్ క్యూ4 ఫలితాల విషయానికి వస్తే రూ. 494 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 125.57 కోట్ల లాభం వచ్చింది. మొత్తం ఆదాయం కూడా రూ. 2065.64 కోట్ల నుంచి రూ. 1946.33 కోట్లకు తగ్గింది.