ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ప్రతీ వారం ప్రాక్టికల్స్

Wait 5 sec.

తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు సెకండియర్‌లోనే ప్రాక్టికల్స్ ఉండగా.. ఈ 2026-2027 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు కూడా ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ వారం.. ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం పుస్తకాలు చదవడం వల్ల విద్యార్థులు థియరీ మాత్రమే నేర్చుకుంటారని.. కానీ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేస్తేనే వారు ఒక అంశాన్ని ప్రాక్టికల్‌గా అర్థం చేసుకుంటారని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రతీ కాలేజీలో తప్పనిసరిగా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం పుస్తకాల్లోని బొమ్మలు చూసి పాఠాలు నేర్చుకుంటే సరిపోదని.. కనీసం వారానికి 2 రోజులు ల్యాబ్‌కు వెళ్లి ప్రాక్టికల్స్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ల్యాబ్ ప్రాక్టికల్స్ చేయించకుండా కేవలం థియరీ పాఠాలు చెప్పి.. డైరెక్ట్‌గా ఫైనల్ పరీక్షల్లో ప్రాక్టికల్స్‌ను మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కొత్త మార్పులకు సంబంధించి.. ఇంటర్ బోర్డు అధికారులు త్వరలోనే గైడ్‌లైన్స్‌ను విడుదల చేయనున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 3,339 ఇంటర్ కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. వారిలో దాదాపు 7 లక్షల మంది ఎంపీసీ, బైపీసీ వంటి సైన్స్ గ్రూపులు చదువుతున్నారు. థియరీ క్లాసులో నేర్చుకున్న అంశాలను అదే వారం ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేసేలా కొత్త షెడ్యూల్ తయారు చేయనున్నారు. వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు ల్యాబ్ సెషన్లు ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థుల్లో బట్టీ విధానం పోయి.. సబ్జెక్టుపై అవగాహన వస్తుందని పేర్కొంటున్నారు. ఈ నిర్ణయంతో సబ్జెక్టుపై విద్యార్థులకు పట్టు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇంటర్ మార్కులకే కాకుండా.. నేషనల్ లెవల్ ఎంట్రెన్స్ టెస్ట్‌లు అయిన.. నీట్, జేఈఈ వంటి పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.ఇక ఇంటర్ కాలేజీలు రూల్స్ పాటిస్తున్నాయా అని తెలుసుకునేందుకు అధికారులు టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కాలేజీల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను ఇప్పటికే ఇంటర్ బోర్డు కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో లింక్ చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయా.. విద్యార్థులు ప్రాక్టికల్స్ చేస్తున్నారా అనే అంశాలను బోర్డు అధికారులు మానిటర్ చేయనున్నారు. ఒకవేళ ప్రాక్టికల్స్ చేయించకపోతే సంబంధిత కాలేజీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా బోర్డు రెడీ అవుతోంది.