ఎన్నాళ్లకెన్నాళ్లకు.. కడప స్టీల్ ప్లాంట్ పనులకు ముహూర్తం ఖరారు..

Wait 5 sec.

వైఎస్సార్ కడప జిల్లా వాసుల ఎదురుచూపులు ఫలించాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే నెల (జులై 3న) సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్న బైరెడ్డి శబరి.. తమ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కాదని.. చేతల్లో చూపించే ప్రభుత్వమని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భాగంగా కనీసం కాంపౌండ్ వాల్ కూడా నిర్మించలేదని బైరెడ్డి శబరి విమర్శించారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి హోదాలో గతంలోనే ఒకసారి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2018 డిసెంబర్ 27న చంద్రబాబు చేతుల మీదుగా నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయాన్ని బైరెడ్డి శబరి మరోసారి గుర్తు చేశారు. రాయలసీమను 'రాయల్ సీమ'గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని ఎలక్ట్రానిక్స్ , హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ కాదని.. వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, అనేక కుటుంబాల భవిష్యత్తుకు భరోసా అని బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు వీలుగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. కరెంట్, నీటి సరఫరా, రోడ్లు వంటి మౌలిక వసతులు సిద్ధం చేసిన తర్వాతే స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి దాకా.. 800 కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు బైరెడ్డి శబరి వివరించారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు పరిధిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 3500 ఎకరాల విస్తీర్ణంలో.. రూ.16,350 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతోంది. మొదటి దశలో 4500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టనున్నారు. రెండో దశంలో 11850 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ విస్తరించనున్నారు. 2034 నాటికి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.