అమరావతిలో కీలక అధికారి రాజీనామా.. బాధ్యతలు తీసుకున్న ఆరు నెలలకే!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కీలకంగా ఉన్న ఏజీఐసీఎల్‌ (అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) ఎండీ శ్రీనివాస్ రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. గత నెల 1వ తేదీన శ్రీనివాస్ తన రాజీనామాను ప్రభుత్వానికి పంపించగా.. బుధవారం (జులై 1న) ఆమోదించారు. ఈ రాజీనామా జూన్‌ 15 నుంచి రాజీనామా అమల్లోకి వస్తుందని పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల్ని సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌ అభిషేక్‌ కుమార్‌కు తాత్కాలికంగా అప్పగించారు. శ్రీనివాస్ మహారాష్ట్ర కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాగా.. ఏపీ ప్రభుత్వం 2025 డిసెంబర్‌లో ఏజీఐసీఎల్‌ ఎండీగా నియమించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం అమరావతికి శ్రీనివాస్ వంటి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సేవలు అవసరమని భావించింది. అందుకే అమరావతి గ్రోత్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌‌ను ఏర్పాటు చేసి ఆయన్ను ఎండీగా నియమించారు. ఏజీఐసీఎల్‌ ఎండీ హోదాలో శ్రీనివాస్ సీఆర్‌డీఏ, ఏడీసీఎల్‌ పరిధిలో ఉండే నిర్మాణ పనులన్నింటినీ పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాస్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రంగంలోకి దిగారు.. అమరావతిలో భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయించారు. కాంట్రాక్టర్లకు టార్గెట్ పెట్టి పనులు ముందుకు సాగేలా చూశారు. ఇలాంటి సమయంలో, అది కూడా ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఆరు నెలలకే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీనివాస్‌ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు లేఖలో ప్రస్తావించినా.. ఆయనకు రిలయన్స్ సంస్థ నుంచి భారీ ఆఫర్‌ వచ్చిందని ప్రచారం జరుగుతోంది.. అందుకే ఆయన రాజీనామా చేశారా అంటూ చర్చ మొదలైంది.వాస్తవానికి శ్రీనివాస్ గత నెల 1వ తేదీన రాజీనామాను ప్రభుత్వానికి పంపితే దాదాపు నెల రోజుల తర్వాత ఆమోదించడం విశేషం. అంతేకాదు శ్రీనివాస్ గతంలోనే రాజీనామా చేస్తానని చెప్పగా.. కొంతమంది ప్రభుత్వ పెద్దలు పిలిచి మాట్లాడటంతో వెనక్కు తగ్గారనే ప్రచారం కూడా ఉంది. అమరావతిలో కీలకమైన బాధ్యతలు అప్పగించిన వ్యక్తి ఇలా కొన్ని నెలలకే రాజీనామా చేసి వెళ్లడం ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.. ఈ బాధ్యతల్ని కొత్తగా ఎవరికైనా అప్పగిస్తారా, ఒకవేళ అప్పగిస్తే మళ్లీ రిటైర్డ్ అధికారులకు అవకాశం ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో సీఆర్‌డీఏలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. కన్నబాబును పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. రెండు నెలల క్రితం సీఆర్‌డీఏకు ముగ్గురు అదనపు కమిషనర్‌లను ప్రభుత్వం నియమించింది. కొల్లాబత్తుల కార్తీక్‌, జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, ధాత్రీరెడ్డిలకు సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌లుగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే భార్గవ్‌తేజ సీఆర్‌డీఏలో అడిషనల్ కమిషనర్‌గా ఉన్నారు.