వార్ వన్ సైడ్.. విండీస్‌ను చిత్తు చేసి టీ20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన ఆసీస్..!

Wait 5 sec.

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో ఆ జట్టు.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఈ టోర్నీ చరిత్రలో 8వ సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆడిన ఆరు మ్యాచ్‌లలోనూ గెలిచింది. దీంతో ఓటమి అనేది లేకుండా తుది పోరుకు అర్హత సాధించింది.లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. విధ్వంసకర బ్యాటర్లతో కూడిన విండీస్ బ్యాటింగ్ యూనిట్‌ను ఆసీస్ బౌలర్లు కట్టడి చేశారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ.. వరుసగా వికెట్లు తీశారు. దీంతో వెస్టిండీస్‌కు పరుగుల రావడం కష్టంగా మారింది. కెప్టెన్ హేలీ మాథ్యూస్ (28 బంతుల్లో 30 రన్స్) సహా టాప్ ఆర్డర్ బ్యాటర్లు ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో సోఫీ మెలినిక్స్, ఆష్లే గార్డ్‌నర్, జార్జియా వరేహమ్ రెండేసి వికెట్లు తీశారు. సదర్లాండ్ ఒక వికెట్ తీసింది.అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేధించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది. కెప్టెన్ బెత్ మూనీ.. 36 బంతుల్లో 61 రన్స్ చేసింది. ఆష్లే గార్డ్‌నర్ (20 బంతుల్లో 35 రన్స్‌) కూడా సత్తాచాటడంతో ఆసీస్.. 13 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ టోర్నీలో ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ చేరడం ఇదే ఎనిమిదవ సారి కావడం గమనార్హం.మరోవైపు గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు.. ఆదివారం ఆస్ట్రేలియాతో టైటిల్ పోరులో తలపడనుంది.