తిరుపతి దేవస్థానం ఈవో ముద్దాడ రవిచంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులకు పదవీ విరమణ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీటీడీలోని వివిధ శాఖల్లో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ పొందిన 122 మంది ఉద్యోగులకు మంగళవారం సామూహిక సన్మానం కార్యక్రమం నిర్వహించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. టీటీడీలో ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత.. వారికి సన్మానం చేసే కార్యక్రమాన్ని సమిష్టిగా చేయాలా లేదా శాఖల వారీగా చేపట్టాలా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వివిధ శాఖల్లో, పలు హోదాలలో సుదీర్ఘ కాలం విధులు నిర్వహించి పదవీ విరమణ అయిన వారిని గౌరవించి, వారికి అందే ప్రయోజనాలు అదే రోజు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని టీటీడీ ఈవో రవిచంద్ర అధికారులకు సూచించారు. ప్రతి రోజూ సరాసరి 75 వేల మందికిపైగా శ్రీవారి భక్తులకు సేవలందిస్తున్న ఉద్యోగులను అభినందించారు. అనంతరం రిటైర్ అయిన 122 మంది ఉద్యోగులు ఒక్కొక్కరికి శ్రీవారి లడ్డూ, అక్షితలు, తీర్థం, వడ, అమ్మవారి కుంకుమ, పసుపు, రవికె, శాలువా ఇచ్చి సత్కరించారు. అనంతరం టీటీడీ ఈవోను ఉద్యోగులు సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులు తమ ఇళ్లకు చేర్చేలా వాహనాలను ఏర్పాటు చేశారు. టీటీడీకి రూ.1 కోటి విరాళంతిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించింది. సంస్థ ప్రతినిధులు తరుణ్, రమేష్ మంగళవారం రోజున తిరుమలలో టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో బి.ఆర్. నాయుడుకు విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల ప్రాణాలను కాపాడే కార్యక్రమంలో భాగస్వాములైన అపర్ణ సంస్థ యాజమాన్యాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కొనియాడారు.