ఇటీవల వెనుజులాలో భారతీయ నావికుడి అనుమానాస్పద మృతిచెందగా.. అతడి శరీర భాగాలు మాయం కావడం కలకలం రేపుతోంది. మృతదేహం భారత్‌కు వచ్చిన తర్వాత కుటుంబసభ్యుల అభ్యర్థన మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించడంతో ఈ విషయం బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్‌ డియోరియా జిల్లాకు చెందిన రాకేష్ చౌహన్ వెనుజులాలో నెల రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన మృతదేహం భారత్‌కు పంపడానికి ముందు వెనుజులా అధికారులు.. ఆయన కుటుంబానికి పోస్ట్‌మార్టం నివేదిక గానీ, మరణానికి దారితీసిన పరిస్థితులపై ఎలాంటి సమాచారాన్ని అందజేయలేదు. రాకేష్ మృతిపై కుటుంబం అనుమానాలు వ్యక్తం చేయడంతో స్థానిక అధికారుల పర్యవేక్షణలో రెండోసారి పోస్టుమార్టం నిర్వహించగా.. విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, లివర్‌, కిడ్నీలు, జీర్ణాశయం, పేగులు తదితర ముఖ్యమైన అవయవాలు మాయమైనట్టు వెల్లడయ్యింది. థైరాయిడ్, స్వరపేటిక, శ్వాసనాళం కూడా లేవని ది ఫెడరేషన్‌ ఆఫ్‌ సీఫేరర్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాలను ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకుంది. దీనిపై విచారణ జరపించాలని డిమాండ్ చేసిన యూనియన్.. నావికులు బలిపశువులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెనెజులా అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిపింది.మరణానికి ముందు జరిగిన గాయాలేవీ నమోదు కాలేదని, అవయవాలు మాయం కావపోవడం వల్ల కారణాన్ని నిర్ధారించలేకపోయారని ఎఫ్‌ఎస్‌యూఐ పేర్కొంది. నావికుల యూనియన్ ప్రకారం.. మృతదేహాన్ని స్వస్థలానికి పంపే ముందు దాదాపు ఒక నెల పాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచినట్లు సమాచారం. ఎఫ్‌ఎస్‌యూఐ మూడు డిమాండ్లను ముందుకు తెచ్చింది. న్యాయం, పారదర్శకత, నష్టపరిహారం అందించడానికి ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని కోరింది. బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని కూడా ఎఫ్‌ఎస్‌యూఐ డిమాండ్ చేసింది. 1. వెనిజులా అధికారుల నుంచి పూర్తి విచారణ, జవాబుదారీతనం. 2. వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తక్షణమే జోక్యం చేసుకోవాలి.. 3. పూర్తి శవపరీక్ష నివేదిక, మరణానికి గల కారణాలు, కుటుంబానికి న్యాయం, నష్టపరిహారం ఈ మూడు ప్రధాన డిమాండ్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా సంఘర్షణ ప్రభావిత ప్రాంతాలలో భారతీయ సిబ్బంది భద్రత, వారి పట్ల వ్యవహరిస్తున్న తీరుపై నావికుల సంఘాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనల మధ్య ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రపంచ నావికుల్లో భారతీయులు 12 శాతం ఉన్నారు. అంతర్జాతీయ మారిటైమ్ సంస్థ సెక్రటరీ-జనరల్ ఆర్సెనియో డొమింగెజ్ ఇటీవల మాట్లాడుతూ.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య నావికులు తాము విస్మరణకు గురయ్యామనే భావనలో ఉన్నారని హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ వంటి సంఘర్షణలలో నౌకల రవాణాను పావుగా ఉపయోగించవద్దని ఆయన నొక్కి చెప్పారు.