పోలీస్ స్టేషన్‌లో యువకుడి మృతి.. లాకప్ డెత్ కేసులో పోలీసులపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్

Wait 5 sec.

తెలంగాణలో సంచలనం సృష్టించిన రాజేశ్ లాకప్ డెత్ కేసులో (ఎన్‌హెచ్‌ఆర్సీ) కీలకంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను మూడు వారాల్లో సమర్పించాలని సూర్యాపేట జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవహారంలో లాయర్ రామారావు ఇమ్మినేని ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాజేశ్‌ను కోదాడ పోలీసులు 5 రోజుల పాటు అక్రమంగా నిర్బంధించి.. థర్డ్ డిగ్రీ పద్ధతుల్లో చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. ఫిర్యాదును ప్రాథమికంగా పరిశీలించిన కమిషన్, కేసు తీవ్రతను గుర్తించి అధికారుల నుంచి వివరణ కోరింది.బాధిత కుటుంబ సభ్యులు రాజేశ్ మృతిని కస్టడీ హత్యగా పరిగణించాలని, బాధ్యులపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన అన్ని కీలక పత్రాలను సమర్పించాలని ఎన్‌హెచ్‌ఆర్సీ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా పోస్ట్‌మార్టం నివేదిక, పోస్ట్‌మార్టం వీడియో, మేజిస్ట్రియల్ విచారణ నివేదిక, మెడికల్ రికార్డులు, దర్యాప్తు పురోగతికి సంబంధించిన అన్ని పత్రాలను కమిషన్‌కు అందించాలని ఆదేశించింది. అలాగే ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించింది.ఈ కేసులో సూర్యాపేట జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రాజేశ్ మరణానికి దారితీసిన పరిస్థితులు, పోలీసుల పాత్ర, దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరింది. అదేవిధంగా ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించిందా? ఎలాంటి చర్యలు తీసుకుందనే అంశాలపై కూడా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసులో భాగంగా రాజేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టడీలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆయన మరణానికి గల కారణాలపై ప్రస్తుతం తీవ్ర వివాదం నెలకొంది. ఎన్‌హెచ్‌ఆర్సీ జోక్యంతో ఈ కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.