ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్ ప్రశ్న రావణ్‌ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు.. అతడిని కాకినాడ జిల్లా పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే విచారణ తర్వాత పిఠాపురంలో మెజిస్ర్టేట్‌ ముందు హాజరుపరచగా.. పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేశారు. ఈ క్రమంలోనే వెంటనే మరో కేసులో ప్రశ్న రావణ్‌ను.. సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం వైద్య పరీక్షల కోసం ప్రశ్న రావణ్‌ను కాకినాడ జీజీహెచ్‌కు తరలించేందుకు ప్రయత్నించగా తీవ్ర హైడ్రామా నెలకొంది. ప్రశ్న రావణ్‌ ఉన్న సర్పవరం పోలీస్ స్టేషన్‌ వద్దకు భారీ ఎత్తున జనసేన నేతలు, కార్యకర్తలు రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రశ్న రావణ్‌ను జీజీహెచ్‌కు తరలిస్తుండగా వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ ముందు జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల ప్రొటోకాల్‌ వాహనాలను అడ్డగించిన జనసేన కార్యకర్తలు.. ప్రశ్న రావణ్‌ను తమకు అప్పగించాలని పోలీసుల ముందు సంచలన డిమాండ్‌ ఉంచారు. ఈ క్రమంలోనే ప్రశ్న రావణ్‌ను తరలిస్తున్న పోలీస్ వాహనంపై కోడి గుడ్లు విసిరారు.విద్యార్థుల మధ్య జరిగిన గొడవను ప్రశ్న రావణ్ రెండు కులాల మధ్య గొడవగా చిత్రీకరించాడని.. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌పై, ప్రజాప్రతినిధులపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసుల్లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. బుధవారం పిఠాపురం పోలీస్‌ స్టేషన్‌లో విచారణ చేసిన పోలీసులు.. ప్రజాప్రతినిధులపై ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని ప్రశ్నలు సంధించారు. జూన్ 28వ తేదీన ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో పాల్గొన్న ప్రశ్న రావణ్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సహా రాధా మనోహర్‌ దా‌స్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే పవన్‌ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించాడని.. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పిఠాపురానికి చెందిన జనసేన నేత బొజ్జా కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పిఠాపురం పోలీసులు.. మంగళవారం రాత్రి హైదరాబాద్‌‌కు వెళ్లి ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేసి.. బుధవారం పిఠాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.