ఏపీలో గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని పనుల్లో స్పీడ్ పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సిరీయస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడుతూ.. . మావిగన్ రాజధాని కావాలని అనుకునే వారు వైఎస్సార్సీపీకి ఓటేయండి. అమరావతి రాజధాని కావాలని అనుకునే వారు కూటమికి ఓటేసుకోండని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి మావిగన్ అంశాన్ని జగన్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.అమరావతి నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని.. కానీ మావిగన్ కోసం అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని జగన్ చెబుతున్నారు. తక్కువ ఖర్చుతోనే మావిగన్‌లో రాజధాని నిర్మాణం చేపట్టొచ్చని ఆయన అంటున్నారు. అయితే మావిగన్ అంటే ఏంటో తనకు అర్థం కావడం లేదని.. చిన్న పిల్లలు కూడా దాన్ని చూసి నవ్వుకుంటున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. . అమరావతి నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని.. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదుద్దుతాని బాబు తెలిపారు. తమ ప్రభుత్వం అమరావతి పనులను వేగవంతం చేస్తుంటే.. పెట్టుబడులు రాకుండా గందరగోళ పరిస్థితులు సృష్టించడానికి జగన్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్‌కు మావిగన్ ఉపయోగకరంగా ఉంటుందా? లేదా అమరావతి ప్రయోజనకరమా అనేది చూద్దాం..జగన్ చెప్పినట్లు మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల కలయిక. ఈ మూడు ఇప్పటికే ఉన్న నగరాలు. ఈ నగరాల్లోకి మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తూ లేదా కనెక్ట్ చేస్తూ ఓ పెద్ద స్థాయి నగరాన్ని నిర్మిస్తారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్లు, నౌకాశ్రయం, స్టార్ హోటల్స్ ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని జగన్ చెబుతున్నారు. కొత్తగా భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి.. ప్రభుత్వానికి ఆర్థికంగా భారం కాదు.కానీ ఇప్పటికే ఇక్కడ జనం పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. జనాభా పెరిగే కొద్దీ ఆయా ప్రాంతాలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. నగరాల పరిధిలో, శివార్లలో రోడ్ల విస్తరణకు భూమిని సేకరించాల్సి ఉంటుంది. ఇది ఖరీదైన వ్యవహారమే. మూడు నగరాలను కలిపి ఓ రాజధానిగా నిర్మించడం వల్ల దానికి ఓ ఐకానిక్ సిటీ లుక్ రాదు. అయితే 5-10 ఏళ్ల కాలం తీసుకుంటే.. మావిగన్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. ఇప్పటికే అప్పుల భారంతో సతమతం అవుతున్న రాష్ట్రానికి మరింతగా కొత్త అప్పులు తేవాల్సిన అవసరం తప్పుతుంది.మావిగన్ అనుకూలతలు..రాజధానికి తక్కువ ఖర్చు, రూ. 20 వేల కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం మచిలీపట్నం రూపంలో రాజధానికి నౌకాశ్రయం అందుబాటులో ఉంటుంది. పోర్ట్ ఆధారిత డెవలప్‌మెంట్ పెరుగుతుందిమచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కి. మీ. పరిధిలోని నగరాలు, పట్టణాలు, గ్రామాలు డెవలప్ అయ్యే ఛాన్స్ అమరావతితో పోలిస్తే సారవంతమైన వ్యవసాయ భూములను వాణిజ్య, నివాస అవసరాలకు వాడుకోవడం తగ్గుతుంది.ప్రతికూలతలు..మచిలీపట్నం-గుంటూరు మధ్య 110 కి. మీ. కారిడార్‌ను డెవలప్ చేయడానికి రహదారుల పక్కన భూసేకరణకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది.విజయవాడ, గుంటూరు నగరాలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. ఈ నగరాల్లో రోడ్ల విస్తరణ కష్టం అవుతుంది.కొన్ని ప్రభుత్వ శాఖలు మచిలీపట్నంలో, కొన్ని విజయవాడలో, మరికొన్ని గుంటూరులో ఉంటే పనుల కోసం ప్రజలు ఎక్కువ దూరం తిరగాల్సి రావచ్చు.అమరావతి కోసం ఇప్పటికే రైతులు వేలాది ఎకరాల భూములు ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది.అమరావతి అనుకూలతలు, ప్రతికూలతలు..2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఇందుకోసం తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతుల దగ్గర్నుంచి 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 16 వేల ఎకరాలకుపైగా భూములను సమీకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.అమరావతి కొత్త నగరం కాబట్టి చక్కటి ప్లానింగ్‌తో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని నిర్మించొచ్చు. అమరావతి, మావిగన్ రెండూ భౌగోళికంగా రాష్ట్రానికి మధ్యలోనే ఉంటాయి. ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిని ప్రభుత్వం అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు.అయితే అమరావతి నిర్మాణానికి భారీగా ఖర్చు అవుతుంది. రోడ్లు వేయడం, భూగర్భ డ్రైనేజీ, విద్యుత్ లైన్లు, నీళ్ల పైపులు వేయడం లాంటి పనులకు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అమరావతికి నగరంగా ఓ రూపం రావడానికి తక్కువలో తక్కువగా పదేళ్ల సమయం పడుతుంది.అయితే రాబోయే వందేళ్ల అవసరాలకు తగ్గట్టుగా అమరావతి నిర్మాణం చేపట్టొచ్చు. ఒక ప్లాన్డ్ మెట్రోపాలిటన్ సిటీగా అమరావతిని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిలో రకరకాల జోన్లు ఉన్నాయి. కాబట్టి నగరం నిర్మాణం కొంత కొలిక్కి వస్తే.. పెట్టుబడులను ఆకర్షించడం తేలిక అవుతుంది. కొత్తగా బ్రాండ్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు భరించి, 20 ఏళ్లపాటు అభివృద్ధి చేయగలిగితే అమరావతి ఓ అధునాతన నగరంగా ఎదుగుతుంది. 50 ఏళ్లలో ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుంది. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలను తీర్చగలదు.అమరావతి సీఆర్‌డీఏ పరిధిలోకి కోర్ క్యాపిటల్ ఏరియా పరిధిలోకి వచ్చే 29 గ్రామాలతోపాటు విజయవాడ, గుంటూరు, మంగళగరి-తాడేపల్లి నగరపాలక సంస్థలు వస్తాయి. వీటితోపాటు తెనాలి, గుడివాడ, జగ్గయ్యపేట తదితర పట్టణాలు సైతం సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయి.చివరగా.. మావిగన్‌తో 5-10 ఏళ్ల కాలంలోనే వేగంగా అభివృద్ధి సాధించొచ్చు. ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కానీ ఆ తర్వాత పట్టణీకరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదే అమరావతి విషయానికి వస్తే.. ఆరంభ దశలో ముందుకెళ్లడం కష్టంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.