జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. విధి ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా.. అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు ఒక అనాథ కుర్రాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాదాద్రిపల్లి గ్రామానికి చెందిన కుందం శివ అనే విద్యార్థి అత్యంత కఠినమైన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 211వ ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఆలిండియా 24వ ర్యాంకు సాధించాడు. ఈ ర్యాంకు ద్వారా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబేలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో సీటును సొంతం చేసుకున్నాడు.శివ సాధించిన ఈ విజయం వెనుక ఒక గుండెను పిండేసే కన్నీటి గాథ ఉంది. ఎనిమిదేళ్ల క్రితం అతడి తల్లి జ్యోతి తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా మరణించింది. తల్లి లేని లోటును దిగమింగుకుంటూ కాలం వెళ్లదీస్తున్న సమయంలో.. ఆరేళ్ల క్రితం శివ తండ్రి శ్రీను సైతం ఒక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలో పని చేస్తూ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోవడంతో శివ, అతడి చెల్లెలు మల్లిక అనాథలుగా మారారు. ఆ చిన్నారుల జీవితం అంధకారంగా మారిన వేళ.. మేనమామ నోముల నాగరాజు ఆ పిల్లల బాధ్యతను భుజాన వేసుకున్నాడు. తాను రెక్కలు ముక్కలు చేసుకుంటూనే మేనల్లుడిని, మేనకోడలిని చేరదీసి కంటికి రెప్పలా కాపాడాడు.అన్నచెల్లెలిద్దరికీ చదువుపై ఉన్న ఆసక్తిని, వారి అసాధారణమైన అకడమిక్ ప్రతిభను గుర్తించిన మిర్యాలగూడ ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్ అమరేందర్ రెడ్డి వారికి అండగా నిలిచారు. పాఠశాల ఫీజులలో రాయితీలు ఇవ్వడమే కాకుండా.. వారికి ఉచిత వసతి, నాణ్యమైన విద్యను అందించి ప్రోత్సహించారు. పాఠశాల విద్య ముగిసిన తర్వాత చదువుపై శివకు ఉన్న ఆసక్తిని గుర్తించిన హైదరాబాద్ రావిర్యాలలోని నారాయణ ఐఐటీ అకాడమీ యాజమాన్యం అతడికి జేఈఈ కోచింగ్ కోసం ఉచితంగా సీటు కేటాయించింది. నారాయణ కాలేజీ కోర్ డీన్ వెంకట్ రెడ్డి, అధ్యాపక బృందం శివకు అండగా నిలిచి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.తనను నమ్మి ఆదరించిన మేనమామ, అండగా నిలిచిన గురువుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శివ రాత్రింబవళ్లు కష్టపడి చదివాడు. తల్లిదండ్రులు లేరనే బాధను చదువుపై ఉన్న పట్టుదలగా మార్చుకున్నాడు. ఫలితంగా దేశంలోనే అత్యుత్తమ ఐఐటీ క్యాంపస్‌లో డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ సీటును సాధించాడు. శివ సాధించిన ఈ అసమాన విజయంపై మిర్యాలగూడ ప్రజలతో పాటు విద్యా వర్గాల నుంచి ప్రశంసలు జల్లు కురుస్తోంది. మాత్రమే జీవితాన్ని మారుస్తుందనేది శివ సాధించిన విజయం నిరూపించిందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. శివది స్పూర్తిదాయక జర్నీ అని అతడు ఎందరికో ఆదర్శంగా నిలిచాడాని కొనియాడుతున్నారు.