ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా టీ20 సిరీస్‌లో ఓడిపోయిన భారత జట్టు.. ఇప్పుడు పటిష్ట ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. బుధవారం ఈ రెండు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ యూకేలోని చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా జరగనుంది. బలమైన ఇంగ్లాండ్‌పై ఎలాంటి ప్రదర్శన చేస్తుంది.. మరి ఈ సిరీస్‌లో అయినా వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కుతుందా లేదా అనే విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.ఫామ్‌లేమి, వయసు ప్రభావం దృష్ట్యా.. టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి.. బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌కు జట్టు పగ్గాలు అందించింది. అయితే తొలి సిరీస్‌లోనే అతడు నిరాశపరిచాడు. దీంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో సారథిగా, ఆటగాడిగా అతడు రాణించాల్సిన అవసరం ఉంది. ఇక 15 ఏళ్ల వయసులోనే భారత జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీపై ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. ఐపీఎల్ 2026లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఈ బుడ్డోడు.. ఇటీవల జరిగిన ట్రై సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. అయినా సీనియర్లపై విశ్వాసం ఉంచిన జట్టు మేనేజ్‌మెంట్ వైభవ్‌ను బెంచ్‌పై కూర్చోబెట్టింది. రెండు మ్యాచులలోనూ టాప్ ఆర్డర్ విఫలం కావడంతో మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వస్తున్నాయి.ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో అభిషేక్ శర్మకు జోడీగా బరిలో దిగాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది జరగాలంటే సంజూ శాంసన్‌పై వేటు పడాలి. ఇక పటిష్ట ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్ సత్తాచాటాల్సి ఉంది. పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ జోరు కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. పిచ్‌ను బట్టి మూడో స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయినా ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. టీ20 క్రికెట్‌లో మెరుగైన జట్లలో ఇంగ్లాండ్‌ను ఒకటిగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించేందుకు సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.