: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను సవరించింది. ఈ మేరకు మోదీ సర్కార్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇక్కడ పెట్రోల్‌పై (లాభాల పన్ను) లీటరుపై అంతకుముందు రూ. 1.5 గా ఉండగా ఇప్పుడు దీనిని 100 శాతానికిపైగా పెంచి రూ. 4 కు చేర్చింది. ఇదిలా ఉన్నప్పటికీ మరోవైపు డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్‌పై (విమాన ఇంధనం) స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని (SAED) తగ్గించడం విశేషం. ఈ కొత్త రేట్లు జులై 1 నుంచే అమల్లోకి వస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ టాక్స్ ఇప్పుడు లీటరుకు రూ. 8.5 కు చేరింది. అంతకుముందు ఇది రూ. 14 గా ఉండేది. దాదాపు 40 శాతం వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఇక విమాన ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం లీటరుపై రూ. 12.5 నుంచి రూ. 7.5 కు తగ్గింది. ఇది కూడా 30 శాతానికిపైగా దిగొచ్చింది. అయితే ఈ పన్ను మార్పుల వల్ల సామాన్య ప్రజలపై ఏమైనా భారం పడుతుందా? బంకుల్లో రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు ఏమైనా మారతాయా? వంటి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. విండ్‌ఫాల్ టాక్స్ ఏంటి? (What is Windfall Tax)పెట్రోల్, డీజిల్‌పై విండ్‌ఫాల్ టాక్స్ తగ్గించడం లేదా పెంచడం వల్ల రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇది కేవలం ఆయిల్ కంపెనీలపై విధించే లాభాల పన్నుగా చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన సమయంలో ఆయా చమురు కంపెనీలు (రిలయన్స్, ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటివి) దేశీయ అవసరాలకు వినియోగించకుండా విదేశాలకు ఎగుమతులు పెంచుకొని లాభాలు ఆర్జిస్తుంటాయి. అందుకే దేశీయంగా లభ్యతను పెంచి, ఎగుమతులు తగ్గించాలన్న ఉద్దేశంతో, వాటి లాభాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం గతంలో 2022 జులైలో ఈ విండ్‌ఫాల్ టాక్స్ విధానం తీసుకొచ్చింది. ఈ దేశాలకు ఎగుమతులపై మినహాయింపుప్రతి 15 రోజులకు ఓసారి కేంద్రం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ఈ టాక్స్‌ను సవరిస్తుంటుంది. గతంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సమయంలో తొలుత విండ్‌ఫాల్ టాక్స్ విధానం తీసుకురాగా తర్వాత . మళ్లీ ఇటీవల అమెరికా- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముడి చమురు ధరలు భారీగా పెరగ్గా మరోసారి ఈ విధానాన్ని తెచ్చింది. అప్పటినుంచి తగ్గించడం లేదా పెంచడం చేస్తూ వస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వ సంస్థల నుంచి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మారిషస్, మాల్దీవులకు చేసే ఎగుమతులపై ఈ విండ్‌ఫాల్ టాక్స్ నుంచి మినహాయింపు ఉంది. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలుఇక దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇటీవల యుద్ధం కారణంగా దాదాపు లీటరుపైనే రూ. 7.50 శాతం వరకు పెరిగాయి. క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 126 డాలర్ల స్థాయి నుంచి ఇప్పుడు 74 డాలర్లకు పడిపోయినా ఆ ధరల్ని కేంద్రం మార్చట్లేదు. మరింత తగ్గితే ఇక్కడా తగ్గించే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పొచ్చు. లీటర్ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రూ. 115.73 గా ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 103.82 గా ఉంది.