అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్.. రూ.54 కోట్ల బంగారం స్వాధీనం.. అస్సాం పోలీసుల స్పెషల్ ఆపరేషన్

Wait 5 sec.

అస్సాం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేసి ఆ రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని బంగారం స్మగ్లింగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ చేసి ఏకంగా రూ. 54 కోట్లకు పైగా విలువ చేసే 37.064 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రూప్స్‌గా విడిపోయి మరీ చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అస్సాం పోలీసులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాంలోని ఖార్‌ఘలి ప్రాంతంలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో నిఘా వర్గాలు స్పెషల్ ఆపరేషన్స్ చేశాయి. ఈ తనిఖీల్లో 37.064 కిలోల బంగారంతో పాటు 13 గ్రాముల వెండి, నాలుగు మొబైల్ ఫోన్లు, రూ. 3,755 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. READ MOREఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను గువాహటి సెంట్రల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ అమితాబ్ బసుమతారి వెల్లడించారు. అస్సాం పోలీసుల చరిత్రలో ఇదే అతిపెద్ద బంగారం ఆపరేషన్ అని ఆయన వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమ బృందం ఈ అక్రమ రవాణాను అడ్డుకుందని ఆయన తెలిపారు. READ MOREమహారాష్ట్రలోని సంగ్లీకి చెందిన 32 సంవత్సరాల అక్షయ్ బన్సోడే అనే వ్యక్తిని ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్షయ్ గువాహటిలోని గాంధీబస్తి ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనిపై లతాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. డీసీపీ అమితాబ్ మాట్లాడుతూ పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం తనదేనంటూ అక్షయ్ బన్సోడే ఎలాంటి ఆధారాలు చూపలేదని అందుకే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ బంగారం ఎక్కడ నుంచి వచ్చింది? ఎక్కడికి తరలిస్తున్నారు అన్న కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా భారత్ - మయన్మార్ సరిహద్దు మార్గంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌కు చెందిందిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాకు మిడిల్ ఈస్ట్‌‌తో పాటు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరుల్లో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.