తెలంగాణ భాష, సంస్కృతిపై ఆంధ్రోళ్ల పెత్తనం నడుస్తోంది.. 'ఇడుపు కాయితం' వివాదంపై పాశం యాదగిరి

Wait 5 sec.

తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా టైటిల్‌పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ పేరుపై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు తెలంగాణ భాష, యాస, సంస్కృతిని కించపరిచే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రారంభమైన ఈ చర్చ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి చిచ్చు రేపింది. ఈ వ్యవహారంలోకి రాజకీయ నేతలు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని రాజకీయ, సామాజిక చర్చగా మార్చాయి.ఇడుపు కాయితం అనే పదంపై ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారని హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పాశం యాదగిరి ప్రశ్నించారు. తెలంగాణ భాషలో సహజంగా వాడే పదాలను ఎగతాళి చేయడం కొత్త కాదని.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఆయన గుర్తు చేశారు. బలగం సినిమా విడుదల సమయంలో ‘మూలుగ బొక్క’ అనే పదాన్ని కొందరు సోషల్ మీడియాలో హేళన చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా స్థానిక సంప్రదాయాలకు సంబంధించిన చిన్న విషయాలపై వివాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేస్తూ.. కేరళలో ఒక పెళ్లి వేడుకలో పాపడ్ విషయంలో గొడవ జరిగిన ఘటనను ఉదాహరణగా ప్రస్తావించారు. అలాంటప్పుడు తెలంగాణ సంప్రదాయాలను మాత్రమే ఎందుకు విమర్శిస్తున్నారని ఆయన నిలదీశారు.తెలంగాణ భాష, యాస, సంస్కృతిపై కొందరు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారని పాశం యాదగిరి ఆరోపించారు. తెలంగాణ ప్రజల మాటతీరు, స్థానిక పదాలను ఎద్దేవా చేయడం ద్వారా వారి సంస్కృతిని అవమానిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా రాజకీయ అంశాలపైనా ఆయన స్పందించారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చెందిన ఓ జర్నలిస్టును అరెస్టు చేసిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఆ సమయంలో జర్నలిస్టు భార్యతో పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ మౌనం పాటించారని విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ఈ ఘటనకు మీడియా కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని పాశం యాదగిరి ఆరోపించారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాల విషయంలో రాష్ట్ర మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. మొత్తంగా ఇడుపు కాయితం సినిమా టైటిల్ చుట్టూ మొదలైన చర్చ.. ఇప్పుడు తెలంగాణ భాష, ప్రాంతీయ గుర్తింపు, సంస్కృతి, మీడియా పాత్ర, రాజకీయాల వరకు పాకింది.