అమెరికాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన కథ విషాదంతమైంది. గత శనివారం కాన్సాస్‌లో కురిసిన భారీ వర్షాలకు మెరుపు వరదలు సంభవించి అతడు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహాలో ఉండే వెంకటేశ్.. హ్యూస్టన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భారీ తుఫాను కారణంగా శనివారం మధ్యాహ్నం కాన్సాస్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అప్పటికే 15 సెం.మీ.లకు పైగా వర్షం కురవగా.. ఆ సమయంలో వెంకటేష్ హ్యూస్టన్‌కు కారులో ప్రయాణిస్తున్నాడు. వెల్లింగ్టన్ సమీపంలోని ఆలివర్ రోడ్‌లోని 600వ బ్లాక్ ప్రాంతంలో ఆకస్మిక వరదలకు అతడి వాహనం కొట్టుకుపోయింది.ఒక వంతెన సమీపంలో అతడు ఇంకా కారులోనే ఉండగానే.. అది నీటిలో మునిగి ఉండటాన్ని చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని సమ్నర్ కౌంటీకి చెందిన ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు తెలిపాయి. రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నప్పటికీ, ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారు అతడ్ని రక్షించలేకపోయారు. పోలీసు డ్రోన్‌లు, కాన్సాస్ హైవే పెట్రోల్ ఎయిర్ యూనిట్‌తో గాలింపు చర్యలు చేపట్టి మరుసటి రోజు వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనను హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తాజాగా ధ్రువీకరించింది. సంతాపం వ్యక్తం చేసిన కాన్సులేట్.. స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.‘‘కాన్సాస్‌లో ఆకస్మిక వరదలకు ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భారతీయ విద్యార్థి వెంకటేష్ దొప్పలపూడి మృతి పట్ల హ్యూస్టన్‌లోని భారత కాన్సులేట్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది.. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి, స్నేహితులకు కాన్సులేట్ సంతాపం తెలియజేస్తోంది.. ఆయన కుటుంబం, సన్నిహితులతో కాన్సులేట్ సంప్రదింపులు జరుపుతుంది.. సాధ్యమైంత మేర సహాయ సహకారాలు అందించడానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తోంది’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేయడానికి, ఆయన పార్థివ దేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియను సులభతరం చేయడానికి హ్యూస్టన్ కాన్సులేట్ ప్రస్తుతం కాన్సాస్ రాష్ట్ర అధికారులు, కుటుంబసభ్యులతో సమన్వయం కాన్సులేట్ చేస్తోంది. వెంకటేశ్ మృతదేహాన్ని భారత్‌కు తరలింపు, అతడి కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు నిధుల సేకరణకు గోఫండ్‌ మీ క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ మొత్తాన్ని రవాణా ఖర్చు, అంత్యక్రియలు, ఇతర అవసరాల కోసం వినియోగించనున్నారు.