నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబయిను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం కూడా భారీ వర్షం కురవగా.. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. అంధేరి- సాకినాకా, జోగేశ్వరిలను కలిపే కుర్లా, ఘాట్‌కోపర్‌తో కలిసి ఖైరానీ రహదారిపై మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో బాధితుడు ఫోన్‌లో మాట్లాడుతున్నట్టు సమాచారం. రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టి.. దాదాపు 2 గంటల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశాయి. అతడ్ని 60 ఏళ్ల షేక్ అస్లాంగా గుర్తించారు. ఈ ప్రమాదానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖరే కారణమని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటన అధికార బీజేపీ కూటమిలో విబేధాలను మరోసారి బయటపెట్టింది. బీఎంసీ మేయర్ తన సొంత డిప్యూటీ నుంచే విమర్శలను ఎదుర్కొంటున్నారు.మ్యాన్‌హోల్ మరణానికి బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని శివసేన (షిండే వర్గం)కు చెందిన డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడి డిమాండ్ చేశారు. ‘‘తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ గురించి తెలియజేసినప్పటికీ మేయర్ ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆమె రాజీనామా చేయాలి’’ అని ఘాడి అన్నారు. బీఎంసీ నిర్లక్ష్యం కారణంగా జరిగిన ప్రాణనష్టానికి తాను కూడా బాధ్యుడినేనని డిప్యూటీ మేయర్ అంగీకరించారు, కానీ తాను అధికారులను అప్రమత్తం చేశానని ఆయన నొక్కి చెప్పారు. దీనికి పూర్తిగా మేయర్, బీఎంసీ కమిషనర్ అశ్విని భిడేలే కారణమని ఆరోపించారు. భిడేను లక్ష్యంగా చేసుకున్న ఆయన.. బీఎంసీ కమిషనర్ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఘడి కోరారు. మ్యాన్‌హోల్ మృతి నేపథ్యంలో బీఎంసీలో బీజేపీ, శివసేనల మధ్య వర్గ పోరు బయటపడిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, ఆ పదవి సాంప్రదాయకంగా తమ పార్టీకే ఉందని వాదిస్తుండగా.. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ మేయర్ పదవి తమకే కావాలని పట్టుబట్టింది. సుదీర్ఘ చర్చల అనంతరం, బీజేపీ మేయర్, శివసేన డిప్యూటీ మేయర్‌తో అధికారాన్ని పంచుకునే ఫార్ములాకు ఇరుపక్షాలు అంగీకరించాయి.మ్యాన్‌హోల్ మృతి ఘటనపై శివసేన ఎంపీ మిలింద్ దేవరా కూడా కూటమి నేతృత్వంలోని బీఎంసీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘మరో ప్రాణం పోయింది. ఇది నివారించగల మరో విషాదం. పౌర భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలోపు ఇంకా ఎంతమంది ముంబై వాసులు చనిపోవాలి? తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ 'ప్రమాదాలు' కావు, అవి నిర్లక్ష్యం, విఫలమైన వ్యవస్థలు, జవాబుదారీతనం లేకపోవడం వల్ల సంభవిస్తాయి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, భద్రతలేని రహదారుల పునరావృతమయ్యే సమస్యపై బాంబే హైకోర్టు బీఎంసీని పదేపదే తప్పుబట్టింది. అయినప్పటికీ, పూర్తిగా నివారించే ఈ విషాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబయికి సమాధానాలు కావాల’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.