ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో బకాయిల చెల్లింపులకు నిధులు క్లియర్ అయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం రూ.1,315 కోట్ల విడుదలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ నిధుల్ని 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపునకు వినియోగించనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమశాఖను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఒకటి, రెండు రోజుల్లో ఈ డబ్బులు బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేస్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదలపై విద్యార్థులు ఆనందంలో ఉన్నారు.మరోవైపు ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఇంజినీరింగ్‌ విభాగంలో 2,58,545 మంది పరీక్ష రాశారు.. వీరిలో 1,82,317మంది (70.52%) క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా విభాగంలో 70,929మంది పరీక్ష రాయగా.. వీరిలో 63,546 మంది (89.59%) క్వాలిఫై అయ్యారు. ఆసక్తికరంగా ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల కంటే సీట్లే ఎక్కువగా ఉండటం విశేషం. వీటితో పాటుగా ప్రైవేట్, డీమ్డ్ యూనిర్శిటీలలో సీట్లు అదనంగా ఉన్నాయి. ఇంజినీరింగ్‌ విషయానికివస్తూ 1,82,317 మంది క్వాలిఫై కాగా.. సీట్లు 1,84,970 ఉన్నాయి.. ఈ ఏడాది అదనంగా 6,210 సీట్లు (ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 390 పెరిగాయి) వచ్చాయి. మొత్తం 1.84 లక్షల సీట్లలో ప్రైవేటు కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద 70% భర్తీ చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ప్రైవేట్ యూనివర్శిటీల్లో 35శాతం సీట్లు కన్వీనర్ కోటాలో ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ప్రైవేటు యూనివర్సిటీల్లో 65శాతం, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో 100శాతం సీట్లను యాజమాన్యాలే భర్తీ చేసుకుంటాయి. ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పెరిగిన 6,210 సీట్లకు అనుమతులు నిలిపివేయాలని భావిస్తోంది. ప్రైవేట్ కాలేజీలు మాత్రం మేనేజ్‌మెంట్ కోటాలోనైనా ఈ సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అంటున్నారు.. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్, మెంటార్‌షిప్‌ అందించేందుకు జీఆర్‌ ఐఏఎస్‌ అకాడమీ ముందుకొచ్చింది. ఈ మేరకు ‘జీఆర్‌సెట్‌-2026’ స్కాలర్‌షిప్‌ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత పరీక్ష ద్వారా ప్రతిభ ఆధారంగా అత్యుత్తమ 40 మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. హైదరాబాద్‌లో సమగ్ర ఆఫ్‌లైన్‌ బ్యాచ్‌లో ఎంపికైన అభ్యర్థులు చేరతారన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నేటితో గడువు ముగియనుండగా.. ఈ నెల 12న పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.