తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పోక్సో కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో రకరకాల హైడ్రామాల మధ్య అరెస్ట్ అయి చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తనపై నమోదైన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైందని.. తాను ఎలాంటి నేరం చేయలేదని.. బండి భగీరథ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో పోలీసులు చేస్తున్న దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తున్నానని.. అందుకే తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని బండి భగీరథ్ కోరారు. అయితే.. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి వాదనలు కూడా వినాల్సి ఉందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తదుపరి విచారణను జూలై 3వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. దీంతో బండి భగీరథ్‌కు రెగ్యులర్ బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.ఈ పోక్సో కేసులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో మే 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పరారీలో ఉన్న బండి భగీరథ్‌ను మే 16వ తేదీన అరెస్ట్ చేసిన పోలీసులు.. చర్లపల్లి జైలుకు తరలించగా.. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బండి భగీరథ్ బెయిల్‌పై బయటకు వచ్చి పరీక్షలు రాశారు. బెయిల్ గడువు పూర్తి కావడంతో జూన్ 26వ తేదీన తిరిగి చర్లపల్లి జైలుకు బండి భగీరథ్ వెళ్లారు.మరోవైపు.. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు.. ఇప్పటికే మొయినాబాద్‌లోని అనన్య ఫామ్‌హౌస్‌లో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీన అక్కడ ఏం జరిగింది అనే అంశాలపై బండి భగీరథ్‌ను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఫామ్‌హౌస్‌ను బండి భగీరథ్ ఫ్రెండ్స్ ముందుగానే బుక్ చేసినట్లు గుర్తించారు. మొత్తం ఏడుగురు అక్కడికి వెళ్లినట్లు దర్యాప్తులో కీలక విషయాలు చెప్పారు. ఆ తర్వాత డీసీపీ కార్యాలయంలో కూడా బండి భగీరథ్ విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు.ఇక.. ఈ పోక్సో కేసుకు సంబంధించి బాధితురాలి ఫోటోలు, వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే ఆరోపణలపై పలువురు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపైనా పేట్‌ బషీరాబాద్ పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేయగా.. వాటిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.