తెలంగాణ, కర్ణాటక మధ్య మళ్లీ చెత్త పంచాయతీ.. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

Wait 5 sec.

తెలంగాణ కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్తను.. తెలంగాణలోని మల్గి గ్రామం సమీపంలో డంప్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టిన నిరసన బుధవారం తీవ్ర రూపం దాల్చింది. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు గంటల పాటు నిలిచిపోయాయి. చెత్త వాహనాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన అధికారులు ప్రధాన రహదారిపైనే చెత్త పారబోసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బీదర్-మల్గి మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు ఆందోళన కొనసాగిస్తున్నారు.గత కొన్ని రోజులుగా బీదర్ మున్సిపాలిటీకి చెందిన వ్యర్థాలను తెలంగాణ సరిహద్దులోని మల్గి గ్రామ శివారులో పారబోస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ చెత్త కారణంగా కాలుష్యం పెరిగి.. దుర్వాసనతో పాటు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని వారు పలుమార్లు డిమాండ్ చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని చెబుతున్నారు. చెత్తతో వచ్చిన మున్సిపల్ వాహనాలను బుధవారం రోజున మల్గి గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీదర్ మున్సిపల్ అధికారులు, సిబ్బంది.. మల్గి-బీదర్ ప్రధాన రహదారిపైనే చెత్తను పారబోసినట్లు స్థానికులు ఆరోపించారు. సుమారు 40 వాహనాల చెత్తను రోడ్డుపై కుమ్మరించడంతో అంతర్రాష్ట్ర రహదారి పూర్తిగా మూసుకుపోయింది.దీంతో తెలంగాణ-కర్ణాటక మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు, లారీలు, ఇతర వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు వైపులా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఇరు రాష్ట్రాల పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు, రోడ్డుపై పారబోసిన చెత్తను తొలగించే ఏర్పాట్లు ప్రారంభించారు.తమ గ్రామ శివారులో డంపింగ్ యార్డు కొనసాగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని మల్గి గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా సరిహద్దు ప్రాంతంలో చెత్త పారబోయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు.