రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నబిగ్‌ అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది చేస్తామనే విషయంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టత ఇచ్చారు. బధవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ కార్యర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం నిధులను జూలై 16, 17, 18 తేదీల్లో విడుదల చేయనున్నట్లు నారా లోకేష్ తెలిపారు. ఈ మూడు రోజులు రాష్ట్రంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ నిర్వహించనున్నట్లు లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగానే తల్లికి వందనం పథకం రెండో విడత నిధులు కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. జులై15వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై రాష్ట్రవ్యాప్తంగా డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు పేద విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రూ.15 వేలు సాయం అందిస్తోంది. ఈ 15 వేల రూపాయల్లో రెండు వేల రూపాయలను పాఠశాల నిర్వహణకు మినహాయించుకుని.. మిగతా రూ.13 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. 2025 నుంచి ఈ పథకం అమలు చేస్తుండగా.. ఈ దఫా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు. భాగంగా ఒక ఇంట్లో స్కూలుకు వెళ్లే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ప్రభుత్వం సాయం అందిస్తోంది. అంత మందికీ రూ.13 వేల చొప్పున అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ ఏడాది కూడా దరఖాస్తుల్ని పాఠశాలల ద్వారా ప్రభుత్వం స్వీకరించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల ఉద్యోగులు ఈ పనిలో నిమగ్నమయ్యారు. పరిశీలన తర్వాత అర్హులైన తల్లుల్ని గుర్తించి.. తల్లికి వందనం అర్హుల జాబితాను స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలలో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తారు.